
నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసరావుపేట వాసులు ముగ్గరు బుధవారం మృతి చెందారు. శ్రీరాంపురానికి చెందిన కోట సాయిరామ్(25) వంట నూనెల వ్యాపారం చేస్తూంటాడు. అతని వద్ద బరంపేటకు చెందిన మువ్వల పోతురాజు(50) గుమస్తాగా పని చేస్తూ వుంటాడు. వంటనూనె డబ్బాలను తిరుపతిలో అందించేందుకు వారిద్దరూ క్రిస్టియన్‌పాలేనికి చెందిన జండ్రాసుపల్లి ఎలీషా(25) బొలేరో వాహనంలో మంగళవారం రాత్రి బయలుదేరారు.
మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై బస్సును క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బొలేరో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో డ్రైవర్ ఎలిషా, పోతురాజు అక్కడికక్కడే మృతి చెందగా, సాయిరామ్ తీవ్ర గాయాలతో ఒంగోలు రిమ్స్‌లో మృతి చెందాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎలీషాకు ఏడాది క్రితం ఒంగోలుకు చెందిన మానసతో వివాహం కాగా వారికి మూడునెలల బాలుడు ఉన్నాడు. పోతురాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతి వార్త తెలుసుకొన్న కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment