నెల్లూరు (టౌన్): బతికున్నప్పుడు ఒకాయన బైక్ కొన్నాడు. సుమారు ఏడాది తరువాత మరణించాడు. ఆ తరువాత మూడేళ్లకు ఆయన ఆత్మ వచ్చి సంతకం పెట్టిందో ఏమో.. రవాణా శాఖ అధికారులు ఆ బైక్‌ను వేరే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది. నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామానికి చెందిన మారుబోయిన వెంకటయ్య (తండ్రి బక్కయ్య) 2013లో హీరో గ్లామర్ బైక్‌ను ఒక ఫైనాన్స్ సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. అన్ని పన్నులు చెల్లించి ఏపీ 26 యూజీ టీఆర్ 9347 నంబర్‌తో టెంపరరీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తరువాత 2014 ఫిబ్రవరి 26న వెంకటయ్య మృతి చెందారు. అయినా ఆ బైక్‌కు ఈ ఏడాది జూన్ 5న నెల్లూరు రవాణా కార్యాయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ చేశారు. వెంకటయ్య పేరిట ఏపీ 26 బీఆర్ 3922 నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయిన ఆ బైక్‌ను అదే నెల 16న షేక్ ఖాజావలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. చనిపోయి వ్యక్తి పేరుమీద శాశ్వత రిజిస్ట్రేషన్ చేసినందుకు మధ్యవర్తుల ద్వారా రవాణా అధికారులు కొంత మొత్తాన్ని తీసుకున్నట్లు ప్రచారం జరు గుతోంది.
రిజిస్ట్రేషన్ చేయాలంటే..
బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి ఆధార్, గుర్తింపు కార్డు ఆధారంగా తొలుత తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేస్తారు. ఆ తరువాత వాహన యజమాని శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా కార్యాలయానికి స్వయంగా వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది. వెంకటయ్య తాను కొనుగోలు చేసిన బైక్‌ను శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించకుండానే మృతి చెందారు. ఇలాంటి సందర్భాల్లో ఆ బైక్‌కు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఆ బైక్‌ను మరొకరికి విక్రయించాలన్నా.. తొలుత కుటుంబ సభ్యులు అంటే భార్య, లేదంటే పెద్ద కుమారుడు పేరిట చేయాల్సి ఉంటుంది. ఇందుకు సదరు వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యులతో ఉన్న గుర్తింపుకార్డు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. తొలుత వారి కుటుంబ సభ్యుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తారు. అనంతరం ఎవరైతే ఆ వాహనాన్ని కొనుగోలు చేస్తారో వారిపేరు మీదకు ట్రాన్సఫర్ చేస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా చనిపోయిన వ్యక్తి సంతకంతో బైక్‌ను ఆ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ఆ శాఖలో అవినీతి ఏ మేరకు ఉందనేది తేటతెల్లం చేస్తోంది.
పైసలిస్తే ఏపనైనా సరే ..
రవాణా శాఖలో అడిగినంత డబ్బులిస్తే ఏ పనైనా క్షణాల్లో పూర్తవుతుంది. సరైన పత్రాలు ఉంటే ఒక ధర, లేకుంటే మరో ధర నిర్ణయించి యథేచ్ఛగా వసూలు చేస్తున్నారు. రవాణా కార్యాలయంలో ఏ పని కావాలన్నా కొంతమంది ఏజెంట్లు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా వస్తేనే చేసే విధంగా అధికారులు, గుమాస్తాలు పధకాన్ని రూపొందించారు. ఆయా సెక్షన్లలో చలానాలకు మించి అదనంగా వసూలు చేసే మొత్తంలో ఉన్నతాధికారికి కొంత ముట్టజెబుతుంటారు. రోజుకు ఒక్కో సెక్షనులో అదనపు ఆదాయం సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటోంది. సొమ్ములు వసూలు చేసే ప్రైవేటు వ్యక్తులు రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు కమీషన్ రూపంలో పొందుతున్నారు.
విచారిస్తే మరిన్నిభోగస్ పత్రాలు వెలుగులోకి..
రవాణా శాఖలో నకిలీ పత్రాలపై విచారణ చేపడితే మరిన్ని కేసులు వెలుగులోకి వస్తాయని ఆ శాఖలో పనిచేసే కొంతమంది అధికారులే చెబుతున్నారు. దొంగ ఇన్సూరెన్స్‌ల నుంచి ట్రక్కు బిల్లులు, నకిలీ విద్య, రెసిడెన్స్, మెడికల్, ఫిట్‌నెస్ తదితర సర్టిఫికెట్ల వరకు బయట పడుతాయంటున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో ఆయా సెక్షన్లలో పనులు చేస్తుండటంతో ప్రత్యేకంగా ఓ ముగ్గురు ఏజెంట్లు అధికారులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. పేరు కు మాత్రం రవాణాలో సేవలు పారదర్శకమంటూ అధికారులు ఊదరగొడుతున్నారు.
రిజిస్ట్రేషన్‌కు వాహన యజమాని రావాల్సిందే
వాహనం రిజిస్ట్రేషన్‌కు యజమాని తప్పకుండా కార్యాలయానికి రావాల్సి ఉంది. యజమాని లేకుండా వాహనం రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై విచారణ చేపడతాం. – ఎన్.శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment