సాక్షి, హైదరాబాద్: వర్ధమాన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఒదిలి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, సంపూర్ణ దంపతులకు కుమారుడు దుర్గా ప్రసాద్, కుమార్తె నాగ ఝాన్సీ ఉన్నారు. వారు మూడేళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చారు. ఝాన్సీ ఓ తెలుగు టీవీ చానల్‌లో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్‌లో నటించేది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఝాన్సీకి విజయవాడకు చెందిన సూర్యతేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం ఝాన్సీ ఇంట్లో ప్రేమ విషయం చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు. అయితే రెండు నెలలుగా ఝాన్సీపై సూర్య అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతని వేధింపుల వల్లే ఝాన్సీ నటన ఆపేసి నెల క్రితం ఓ స్నేహితురాలితో కలసి అమీర్‌పేటలో ఓ బ్యూటీపార్లర్ నిర్వహిస్తోందని తెలిపారు.
రోదిస్తున్న ఝాన్సీ తల్లి, కుటుంబ సభ్యులు
వేధింపుల వల్లే ఆత్మహత్య...
నాలుగు రోజులుగా ఝాన్సీ తీవ్ర డిప్రెషన్‌లో ఉందని ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తాను ఇంటికి రాగా తలుపు లోపల నుంచి గడియ ఉందని, కిటికీలోంచి లోపలకు వెళ్లి బెడ్‌రూం తలుపు విరగ్గొట్టి చూడగా ఝాన్సీ ఉరేసుకొని వేలాడుతూ కనిపించిందన్నారు. పవిత్రబంధం అనే సీరియల్‌లో చేస్తున్నప్పుడు తన కుమార్తెకు ఓ అమ్మాయి ద్వారా సూర్య పరిచయమయ్యాడని ఆమె తల్లి సంపూర్ణ గాంధీ ఆసుపత్రిలో బుధవారం విలేకరులకు వివరించారు. గత 6 నెలలుగా తమకు సూర్య పరిచయమని, ఇరువురి పెళ్లికి కూడా తాము అంగీకరించా మన్నారు. గత కొన్ని రోజులుగా ఝాన్సీ ఫోన్లో ఎవరితోనో గొడవ పడుతుండేదని, మూడు రోజుల క్రితమే తన కుమార్తె నగరానికి వచ్చిందన్నారు. ఇంటి నిర్మాణం పనుల కోసం స్వగ్రామంలో ఉన్న తాను సోమవారం ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ బిజీ అని వచ్చిందన్నారు.
సూర్యతో ఝాన్సీ (ఫైల్)
ఆమె ప్రవర్తనలో మార్పు వల్లే దూరంగా ఉన్నా: సూర్య
ఇటీవల ఝాన్సీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా మారకపోవడంతో తాను ఝాన్సీకి దూరంగా ఉన్నానని సూర్య ఓ చానల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ఝాన్సీకి బాబీ, గిరి అనే సినీ బ్రోకర్లతో గతం నుంచే పరిచయం ఉందని, గిరి ఓసారి ఝాన్సీని వేధిస్తే అతన్ని హెచ్చరించానని పేర్కొన్నాడు. ఝాన్సీకి సీరియల్‌లో చాన్సులు లేవన్నాడు. ఝాన్సీ తనకు చివరిసారి వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి వాటిని డిలిట్ చేసిందన్నాడు.
రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నాం: పంజగుట్ట ఏసీపీ
నాగ ఝాన్సీ మృతిపై తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. ఈ కేసులో ఆధారాలుగా ఝాన్సీకి చెందిన రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని వాటిని విశ్లేషణకు పంపామని, ఆ వివరాలతో ఝాన్సీ మరణానికి సంబంధించిన అంశాలు తెలియొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment