బెంగళూరు : బుల్లితెర నటుడు రాజేశ్, ఆయన భార్య శ్రుతిల మధ్య విడాకుల వివాదం తీవ్రస్థాయికి చేరింది. తాను రాజేశ్ ముఖం చూసి పెళ్లి చేసుకోలేదని మనసు చూసి పెళ్లి చేసుకోవటం వల్ల విడాకులు తీసుకోవటం తనకు ఇష్టం లేదన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు శ్రుతి ఆరోపించారు. పోలీసులు విచారించి చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు తనను గానీ, తన కుటుంబసభ్యులను గానీ విచారణ చేయలేదని ఆమె పేర్కొన్నారు. తను కోర్టుకు విడాకుల అర్జీ కూడా పెట్టుకోలేదన్నారు. తనకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదని.. భర్తతోనే కలిసి జీవించాలని నిర్ణయించినట్లు శ్రుతి తెలిపారు. రాజేశ్ తల్లి తనను కట్నం కోసం వేధిస్తూ రెండో పెళ్లికి అవకాశం కావాలని అడగటం వల్లనే తను పోలీసుస్టేషన్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు.
కాగా శృతి అనే యువతితో 2017లో రాజేశ్‌కు వివాహమైంది. అయితే కట్నం కోసం తనను వేధిస్తున్నట్లు శృతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్ మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో తమది సంప్రదాయమైన కుటుంబమని, శృతి బయట మాంసం తిని ఇంటికి వచ్చి తన తల్లిని వేధిస్తున్నట్లు రాజేశ్ అరోపించాడు. కట్నం విషయంలో తాను శృతిని వేధించలేదన్నాడు. విడాకులు కావాలని గతంలో శృతి కోర్టులో కేసు వేసిందని, కట్నం కోసం తాను వేధించినట్లు అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని రాజేష్ పేర్కొన్నాడు. దీంతో వివాదం మరింత ముదిరింది.
Comments
Please login to add a commentAdd a comment