ఇద్దరు చిన్నారులను బలిగొన్న నీటి కుంట,సంజయ్ మృతదేహం వద్ద విలపిస్తున్న అవ్వ ,తల్లి
సాక్షి, జమ్మలమడుగు :నీటిని చూడగానే దిగి ఈతకొట్టాలనిపించింది. కానీ ఆ ఇద్దరు చిన్నారులకు కుంట లోతు తెలియదు..దీంతో వారు కుంటలో దిగిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో ఈ సంఘటన విషాదఛాయలు మిగిల్చింది. గూడెంచెరువు గ్రామానికి చెందిన లింగారెడ్డి..శివకల్యాణ్ వ్యవసాయ కూలీలు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. లింగారెడ్డికి సంజయ్ (9) ఒక్కడే సంతానం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శివకల్యాణ్‌కు ఇద్దరు పిల్లలు. పాప బాబు. బాబు లోకేష్(9) కూడా అదే స్కూలులో మూడో తరగతి చదువుతున్నాడు. సంజయ్, లోకేష్‌లు ఇద్దరూ మంచి మిత్రులు. వీరు సోమవారం మొహరం సెలవు వల్ల పాఠశాలకు వెళ్లలేదు. మరో ఇద్దరితో కలిసి కొండ ప్రాంతంలో కలిపండ్లు కోసుకుని వద్దామని గండికోట రహదారిలోకి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరిన ఓ కుంట దారిలో కనిపించింది.
దీంతో ఇందులో దిగి ఈత కొడదామని సంజయ్, లోకేష్‌లు ఉత్సాహపడ్డారు. ఇంకేమీ ఆ లోచించకుండా వెంటనే నీటిలో దూకారు. ఈ ఇ ద్దరు పిల్లలకు ఈత సరిగా రాదు. 20 అడుగుల లో తుగా ఉన్న కుంటలో చిన్నారులు ఇరుక్కుపోయా రు. ఈతకు దిగని ఇద్దరు మిత్రులు వీరిని చూసి ఆందోళన చెందారు. బయటకు రాలేకపోతున్నారని గ్రహించారు. దీంతో వెంటనే భయపడుతూ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులకు విషయం చెప్పారు. గ్రామస్తులు పరుగున వచ్చి కుంటకు చేరుకునేలోగానే లోకేష్..సంజయ్‌లు విగతజీవులయ్యారు. దీంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. అసువులు బాసిన చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లోకేష్ తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. ఈ బాలుడి మృతదేహం వద్ద తండ్రి కుప్పకూలి రోదించాడు. చిన్నారుల మృతికి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎన్.నాగరాజు, అర్బన్‌సీఐ కత్తి శ్రీనివాసులు కుంటవద్దకు చేరుకున్నారు. ఫైర్ అధికారులు,స్థానికులతో కలిసి కుంట నుంచి చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. పోస్టు మార్టం కోసం జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment