పొలాల్లో పడి ఉన్న శ్యాంప్రసాద్ మృతదేహం .. (అంతరచిత్రం) కనకాల శ్యాంప్రసాద్ పాత చిత్రం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : వివాహేతర సంబంధం ఇద్దరి బలవన్మరణానికి కారణమైంది. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో ఓ హోం గార్డు, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన కనకాల శ్యాంప్రసాద్ (38) వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోం గార్డు (హెచ్ 181) గా పని చేస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు ఆడ పిల్లల సంతానం ఉన్నారు. కుటుంబంతో కలిసి సింగ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శ్యాంప్రసాద్‌కు కొన్ని నెలల క్రితం ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది.
ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో అతను శ్యాంప్రసాద్‌పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులతో పాటు తన భార్యకు, బంధువులకు కూడా తెలియడంతో అవమానభారంతో కుంగిపోయిన శ్యాంప్రసాద్ శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అయితే ఆదివారం ఉదయం నున్న సమీపంలోని సుబ్బయ్యకుంట పొలాల్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని సమాచారం రావడంతో నున్న సీఐ ఎంవీ దుర్గారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, చనిపోయింది హోం గార్డు శ్యాంప్రసాద్‌గా తేలింది.
ఇంట్లో పరువు పోయిందనే అవమానంతో తన ఉద్యోగం కూడా పోతుందనే భయంతో శ్యాంప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్యాంప్రసాద్ మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇక ఎన్నడూ ఏ పాపం చేయనని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన శ్యాంప్రసాద్ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలను పెట్టుకొని అతని భార్య బోరున విలపిస్తోంది.
ప్రియురాలి ఆత్మహత్య
కాగా, శ్యాంప్రసాద్‌తో వివాహేతర సంబంధం నెరుపుతున్న మధురానగర్‌కు చెందిన షేక్ నూర్జహాన్ (38) కూడా ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తన ఇంట్లో పురుగు మందు తాగి అఘాయిత్యం చేసుకుంది. అయితే, ఇద్దరూ ముందుగా అనుకుని ఆత్మహత్య చేసుకున్నారా, లేదా శ్యాంప్రసాద్ ఆత్మహత్య విషయం తెలిసి నూర్జహాన్ అఘాయిత్యానికి పాల్పడిందా అన్నది తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment