
సుక్కమ్మ, బాలయ్య మృతదేహలు
కల్వకుర్తి టౌన్(మహహబూబ్‌నగర్): కేఎల్‌ఐ కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన మండలంలోని తిమ్మరాశిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవి కథనం ప్రకారం.. తిమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోరంట్ల సుక్కమ్మ(40) శుక్రవారం రాత్రి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. శనివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వలో సుక్కమ్మ వస్తువులు కనిపించడంతో గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా సుక్కమ్మ మృతదేహం లభించింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుక్కమ్మ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఆమెకు భర్తతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
బహిర్భూమికి వెళ్లి వృద్ధుడు..
ఇదే గ్రామానికి చెందిన బాలయ్య(80) వృద్ధుడు బహిర్భూమికి వెళ్లి కాల్వలో జారిపడి మృతిచెందాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన బాలయ్య ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెందాడు. కాల్వలో నీరు పారుతుండటంతో అక్కడే పక్కన బోరుమోటార్లకు కట్టిన తాడు అడ్డుకొని మృతదేహం కనిపించింది. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.