నిద్రమత్తులో డ్రైవింగ్‌..మృత్యువుతో పోరాడిన ప్రయాణికుడు | Two Men Died in Bus Accident Kurnool | Sakshi
Sakshi News home page

అతివేగం..ప్రమాదానికి మూలం

Published Sat, Nov 2 2019 1:10 PM | Last Updated on Sat, Nov 2 2019 1:38 PM

Two Men Died in Bus Accident Kurnool - Sakshi

బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన సురేష్‌ను వెలికితీసేందుకుప్రయత్నిస్తున్న ఎస్‌ఐమారుతీశంకర్‌ ,రోదిస్తున్నవిశ్వనాథ్‌ భార్య దుర్గాలక్ష్మి

ప్యాపిలి: సమయం..తెల్లవారుజామున నాలుగు గంటలు. ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి భారీ కుదుపు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అప్పటికే బస్సు తాము ప్రయాణిస్తున్న మార్గాన్ని దాటి అవతలి వైపునకు దూసుకెళ్లింది. గుట్టను ఢీకొట్టి ఆగిపోయింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ వేగంగా బస్సు దిగిపోయారు. ప్యాపిలి పట్టణ సమీపంలోని చిరుతలగుట్ట వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఏ01ఏజే 0322 నంబర్‌ గల జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సు గురువారం రాత్రి  49 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్యాపిలి సమీపానికి  చేరుకుంది.

వంద కిలోమీటర్లకు పైగా వేగంతో బస్సును నడుపుతున్న డ్రైవర్‌ నిద్రమత్తులో తూగాడు. వెంటనే బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఏపీ 21వై 9817 నంబర్‌ గల లారీని ఢీ కొట్టింది. అనంతరం బస్సు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లింది. పొలాలకు ఆనుకుని ఉన్న గుట్టను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రయాణికులు బెంగళూరుకు చెందిన మొగలప్ప విశ్వనాథ్‌  (29), చత్తీస్‌గఢ్‌కు చెందిన  సురేశ్‌ (19) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మనోజ్‌ కుమార్‌(చత్తీస్‌గఢ్‌), మోహన్‌రావు (హైదరాబాద్‌ గచ్చిబౌలి) గాయపడగా.. వారిని డోన్‌  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్యాపిలి ఎస్‌ఐ మారుతీశంకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని తమ సిబ్బంది సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. సంఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద స్థలాన్ని డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. 

మృత్యువుతో పోరాటం
చత్తీస్‌గఢ్‌కు చెందిన సురేశ్‌ దాదాపు రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడాడు. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో సురేశ్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతని ఆర్తనాదాలు విని ఎస్‌ఐ మారుతీశంకర్‌ చలించిపోయారు. తన సిబ్బందితో కలసి సురేశ్‌ను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండు గంటల పాటు శ్రమించినా అతన్ని బయటకు తీయలేకపోయారు. చివరకు క్రేన్‌ సాయంతో శిథిలాలు తొలగించి సురేశ్‌ను బయటకు తీశారు. బయట పడిన కాసేపటికే అతను మృతి చెందాడు. 

తప్పిన ఘోర ప్రమాదం
లారీని ఢీ కొన్న తర్వాత బస్సు అదుపు తప్పి డివైడర్‌ అవతలి వైపునకు దూసుకెళ్లిన సమయంలో ఎదురుగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న మరో  ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అంతే వేగంతో వచ్చింది. అయితే సదరు బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే బస్సును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  రెండు బస్సులు ఢీ కొని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.    

నర్సింగ్‌ ప్రాక్టికల్స్‌కు వచ్చి..
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చంద్రమాకలగడ్డకు చెందిన మొగలప్ప విశ్వనాథ్, దుర్గాలక్ష్మి దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహం కాగా..ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం కర్నూలులో దుర్గాలక్ష్మికి నర్సింగ్‌ కోర్సుకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ ఉన్నాయి. దీంతో కూతురిని బెంగళూరులోని బంధువుల ఇంట్లో వదిలి  భార్యాభర్తలు గురువారం జబ్బార్‌ ట్రావెల్స్‌ బస్సులో కర్నూలుకు బయలుదేరారు. వాస్తవానికి దుర్గాలక్ష్మి ఒక్కరినే కర్నూలుకు పంపాలనుకుని బస్సు ఎక్కించడానికి విశ్వనాథ్‌ వచ్చాడు. తర్వాత మనసు మార్చుకుని అతనూ బయలుదేరాడు. విశ్వనాథ్‌ కళ్లముందే విగతజీవిగా మారడంతో భార్య దుర్గాలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత ‘డాడీకి ఏమైంద’ని పాప అడిగితే  ఏం చెప్పాలంటూ ఆమె  రోదించిన తీరు పలువుర్ని కలచివేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement