
ముళ్ల పొదల్లో లభించిన శిశువు,చికిత్స నిమిత్తం డాక్టర్లకు శిశువును అందజేస్తున్న డీసీపీఓ
పరకాల రూరల్ : మానవత్వాన్ని మంటగలిపే విధంగా నెలలు నిండని మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ముళ్ల పొదల్లో వదిలేశారు. కన్నప్రేమను కాదని పసిగుడ్డును మృత్యువు చేరువలోనికి చేర్చిన విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలోని వరికోల్ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బత్తుల చిన్నమ్మాయి మిషన్ భగీరథ పైపులైనులో కార్మికురాలిగా పనిచేస్తూ గ్రామంలోనే నివాసం ఉంటోంది.
బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన ఆ మహిళకు రక్తంతో ముద్దగా ఉన్న పసిగుడ్డు కనిపించడంతో గ్రామస్తుల సహాయంతో సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ ఈ సమాచారాన్ని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు తెలిపారు.
ఐసీడీఎస్ సీడీపీఓ స్వర్ణలత ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్లు పి.రజిత, జి.రజిత, ఆశ కార్యకర్తలు సునీత, సమ్మక్క, కోమల పరకాల పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి శిశువును తరలించారు. శిశువును పరిశీలించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఆరోగ్యం విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
నెలలు నిండని శిశువు..
శిశువు వయస్సు 6–7నెలల మధ్య ఉన్నట్లు ఎజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంతే కాకుండా శిశువు బరువు 750 గ్రాములు మాత్రమే ఉంది. కాగా శిశువు ఆరోగ్యం విషమంగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స విభాగంలో కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారు. ముళ్ల పొదల్లో శిశువు లభ్యం కావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment