
మహేష్ మురళీధర్ భగవత్
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, మహారాష్ట్ర నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టును వనస్థలిపురం పోలీసులు రట్టు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం 130 కేజీల గంజాయి, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. ముఠాలో ప్రధాన సూత్రధారిగా బానోత్ సుధాకర్‌గా గుర్తించామని అన్నారు.
మహారాష్ట్రలో గంజాయిని కేజీ రూ. 2 వేలకు ఖరీదు చేసి, నగరంలో రూ. 7వేలకు అతడు విక్రయించేవాడు. ఇందులో భాగంగా 130 కేజీల గంజాయిను తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసు బృందం వీరిని సోమవారం వలపన్ని పట్టుకుంది. అయితే ఎవరి వద్ద నుంచి గంజాయి రిసీవ్ చేసుకున్నారో తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల పట్టుబడుతున్న ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్మకాలు చేస్తున్నారనీ, అలాంటి ముఠాలపై 'ఎన్డీపీసీ' యాక్ట్‌తో శిక్షలు పడేలా చూస్తున్నామని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అనేక కేసుల్లో నిందితులకు శిక్షపడే శాతం పెరిగిందనీ, అలానే గంజాయి అక్రమ రవాణా చేసేవారికి పూర్తి స్థాయిలో చెక్ పెడతామని సీపీ మహేష్ భగవత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment