అశ్లీల నృత్యాలు అడ్డుకోబోయినందుకు.. | Villagers Attack on Police While Stops Nude Dance | Sakshi
Sakshi News home page

అశ్లీల నృత్యాలు అడ్డుకోబోయినందుకు..

Published Sat, Jan 19 2019 7:13 AM | Last Updated on Sat, Jan 19 2019 7:13 AM

Villagers Attack on Police While Stops Nude Dance - Sakshi

అశ్లీలనృత్యాలు ప్రదర్శిస్తున్న మహిళలు

విశాఖపట్నం,తుమ్మపాల(అనకాపల్లి):  సంక్రాంతి సంబరాలు గతితప్పాయి. సంప్రదాయాల పేరిట గ్రామాల్లో చేపడుతున్న తీర్థాలు శ్రుతిమించుతున్నాయి. సంక్రాంతి పండుగ నాటి నుంచి పక్షం రోజులపాటు గ్రామాల్లో తీర్థాలు నిర్వహించడం ఆనవాయితీ. వీటిల్లో ఆధునిక పోకడలు వెర్రితలలు వేయడంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇదే తరహా పరిస్థితి అనకాపల్లి మండలం మామిడిపాలెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రాములువారి తీర్థంలో అశ్లీల నృత్యాలను అడ్డుకోబోయిన పోలీసులపై గ్రామస్తులు తిరుగుబాటుకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు(టెక్కలి శ్రీను) తన అనుచరులతో వచ్చిన ఐదుగురు పోలీసులతో తొలుత తోపులాటకు దిగారు. అనంతరం అది కొట్లాటగా మారింది. రూరల్‌ ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి కాలువలో పడిపోవడం, హెడ్‌కాన్సస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు చేయిచేసుకున్న ఘటనలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.

అశ్లీలనృత్యాలు ప్రదర్శిస్తున్న మహిళలు
మండలంలోని మామిడిపాలెంలో గురువారం రాత్రిరాములవారి తీర్థం నిర్వహించారు. రానున్న సార్వత్రిక, స్థానిక ఎన్నికల దృష్ట్యా లబ్ధిపొందేందుకు సర్పంచ్‌ బావ అయిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు(టెక్కలి శ్రీను) సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలతో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నారంటూ ఒకరు  వాట్సాప్‌ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు   రాత్రి 10 గంటల సమయంలో ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లలో కలిసి గ్రామానికి వచ్చారు. స్టేజి వద్దకు వెళ్లారు. ఎలాంటి అశ్లీల నృత్యాలు ఏర్పాటుచేయలేదని నిర్వాహకులతో పాటు స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నృత్యాలు చేసిన మహిళలు సమీపంలో ఉన్నారన్న సమాచారంతో అటువైపు వెళుతున్న పోలీసులకు టీడీపీ నాయకుడు అడ్డుకున్నారు. పోలీసు జీపును స్థానికులు చుట్టుముట్టారు. దీనికి కారణం నువ్వేనంటూ టీడీపీ నేతను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి ప్రయత్నించారు. తామేమి తప్పు చేశామని స్థానికులు ప్రశ్నిస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌లో వచ్చిన దృశ్యాలను హెడ్‌కానిస్టేబుల్‌ చూపిస్తుండగా టీడీపీ నేత దానిని లాక్కున్నారు. దీంతో పోలీసులకు చిర్రేత్తుకొచ్చింది.

మురుగుకాలువలో ఉన్న ఎస్‌ఐ టోపీ
కానీ వారు ఐదుగురే కావడంతో గుంపుగా ఉన్న జనం పోలీసులపై తిరగబడ్డారు. ఎస్‌ఐ ఆదినారాయణరెడ్డి  సమీపంలోని మురుగుకాలువలోకి నెట్టివేయబడ్డారు. ఎస్‌ఐ టోపీ కూడా కాలువలోనే పడిపోయింది.జీపును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ను కొట్టినట్లు సెల్‌ఫోన్‌లో దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసు అధికారులు చెబుతున్నారు. జీపును గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన పోలీసులు తమకు అవకాశమున్న మార్గం ద్వారా స్టేషన్‌కు చేరుకున్నారు. ఇది జిల్లాస్థాయిలో సంచలనమైంది. కాగా సాంస్కృతిక ప్రదర్శనకు అనుమతి తీసుకున్నామని స్థానికులు చెబుతుండగా, అనుమతి లేకుండానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని సీఐ రామచంద్రరావు విలేకరులకు తెలిపారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై సీఐ రామచంద్రరావు నేతృత్వంలో శుక్రవారం మామిడిపాలెంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణ మేరకు టీడీపీ నాయకునితో పాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఎంపీపీ భర్త కొణతాల శ్రీను దగ్గరుండి టీడీపీ నాయకుడ్ని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈక్రమంలో శ్రీనివాసరావును పోలీసులు విచారించిన  నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స చేయించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కొట్టడం వల్లే శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడంటూ బంధువులు  అనకాపల్లి ఆస్పత్రి వద్ద నినాదాలు చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement