ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కౌన్సిలర్ రవికుమార్
సాలూరు: పట్టణంలోని ఏడో వార్డు కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాంధీనగర్‌లోని ఆయన ఇంటిలో చీమలమందు తాగి బుధవారం బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. కౌన్సిలర్ భార్య తరంగణి తెలిపిన వివరాల ప్రకారం... కౌన్సిలర్ తుపాకుల రవికుమార్ ఉదయం టిఫిన్ చేసి టీవీ చూస్తున్న సమయంలో ఆమె వంట గదిలో ఉంది. వచ్చి చూసేసరికి రవికుమార్ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గట్టిగా కేకలు వేస్తూ సమీపంలో ఉన్నవారిని పిలిచింది.
వారి సహకారంతో రవికుమార్‌ను పట్టణ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అయితే ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన రవికుమార్ వద్ద సూసైడ్ నోట్ లభించింది. గాంధీనగర్‌కు చెందిన బంగారు సింహాద్రి కుటుంబ సభ్యుడికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి విశాఖలో ఉంటున్న టి. రమేష్, కె. సత్తిబాబు అతడి నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నారు.
ఈ వ్యవహారానికి రవికుమార్ మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే టి. రమేష్, కె. సత్తిబాబులు ఉద్యోగం ఇప్పించడంలో విఫలం కావడంతో సింహాద్రి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం రవికుమార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో సింహాద్రి భార్య రాములమ్మ, అల్లుడు ధనాల వినయ్, కుమార్తె హైమావతి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ పిల్లలను చంపేయమంటావా అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన రవికుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment