టీడీపీలో టికెట్‌ బేరాలు | TDP Politics In Saluru Municipality | Sakshi
Sakshi News home page

టీడీపీలో టికెట్‌ బేరాలు

Published Thu, Mar 4 2021 5:29 AM | Last Updated on Thu, Mar 4 2021 5:29 AM

TDP Politics In Saluru Municipality - Sakshi

లక్ష్మి చేయిపట్టి గెంటేస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌

సాలూరు: ‘పార్టీలో కష్టపడి పనిచేసే తనకు కాకుండా డబ్బులకు అమ్ముడుపోయి ఇంకెవరికో టికెట్టు ఎలా ఇస్తారు..’ అని ప్రశ్నించిన ఓ టీడీపీ మహిళా నేతను చేయి పట్టుకుని ఓ మాజీ ఎమ్మెల్యే గెంటేసిన ఉదంతం బుధవారం విజయనగరం జిల్లా సాలూరులో చర్చనీయాంశంగా మారింది. టికెట్‌ ఇస్తామని నియోజకవర్గ నాయకులు హామీ ఇవ్వడంతో సాలూరు మున్సిపాలిటీలో బంగారమ్మపేట 25వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొయ్యాన లక్ష్మి నామినేషన్‌ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ ఇంటికి రమ్మని చెప్పడంతో లక్ష్మి, ఆమె భర్త, మద్దతుదారులతో కలిసి వెళ్లారు. ‘నీవు ఎంత ఖర్చు పెడతావ్, టికెట్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలి. నీవు ఎంత ఇవ్వగలవు’ అని భంజ్‌దేవ్‌ అడుగగా, రూ.4 లక్షలు ఇవ్వగలమని తెలిపారు.

అక్కడే ఉన్న మరో అభ్యర్థి ఇంకా ఎక్కువ ఇస్తాననడంతో సీన్‌ రివర్స్‌ అయింది. దీంతో లక్ష్మికి బీ–ఫారం ఇవ్వబోమని చెప్పారు. ‘ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న మమ్మల్ని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్‌ ఇవ్వడం ఎంతవరకు న్యాయం’ అని లక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన భంజ్‌దేవ్‌.. లక్ష్మి చేయి పట్టుకుని బయటకు పొమ్మంటూ నెట్టేశారు. ‘నాకు నచ్చిన వారికే టికెట్‌ ఇస్తా, చేతనైంది చేసుకో..’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్‌ఫోన్లో చిత్రీకరించడంతో ఇది స్థానికంగా వైరల్‌ అయింది. భంజ్‌దేవ్‌ టికెట్‌ అమ్ముకున్నారని లక్ష్మి కంటతడిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుస్తానని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement