రాజమండ్రి : కుటుంబ వివాదాల నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో సోమవారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. నాలుగేళ్లుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న రియల్‌ఎసేట్ట్ వ్యాపారిని అతని భార్య, బావ మరిది, ఇద్దరు కుమారులు కలిసి కత్తులతో పొడిచి హత్య చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం తాళ్ల ముదునూరుపాడు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెలగల పట్టాభి రామారెడ్డి (54) ప్రస్తుతం హుకుంపేట గ్రామంలోని బాలాజీటవర్స్‌లో మారేడుమిల్లి ప్రాంతానికి చెందిన గిరిజన యువతితో కలిసి అద్దెకు ఉంటున్నాడు.
సోమవారం అర్థరాత్రి 12.15 గంటల సమయంలో రామారెడ్డి భార్య సూర్యావాణి, బావ మరిది సత్తిశివకృష్ణా రెడ్డి, కుమారులు యోగాదుర్గాతేజ్ రెడ్డి, డోలాశంకర్‌తేజ్ రెడ్డి బాలాజీటవర్స్‌కు చేరుకున్నారు. అక్కడున్న వాచ్‌మెన్ సాయంతో అతడుండే రెండో ఫ్లోర్‌లో ఫ్లాట్‌కు వెళ్లి బలవంతంగా తలుపులు పగులగొట్టి రామారెడ్డిపై దాడికి దిగారు. కత్తితో పొట్టపైన, మెడపైన విచక్షణా రహితంగా పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో వేరే గదిలో ఉన్న గిరిజన యువతితోపాటు, మరో మహిళ కూడా భయపడి బాత్‌రూంలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నారు.
నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా రామారెడ్డి
నాలుగేళ్ల క్రితం వెలగల పట్టాభిరామారెడ్డికి, భార్య సూర్యావాణికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇంటిలో రూ.15 లక్షల నగదు, పెద్దమొత్తంలో బంగారం చోరీకి గురయ్యాయి. ఆ చోరీ భార్య, బావమరుదులు చేశారని రామారెడ్డి నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య, బావమరుదులు ఆయనను అంతమొందించేందుకు అన్నంలో విషప్రయోగం చేశారు. అప్పటి నుంచి రామారెడ్డి ఇంటికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. దీంతో సూర్యావాణి రామారెడ్డిపై 498ఏ కేసు పెట్టింది. రామారెడ్డి ఆమెతో విడిపోవడానికి కోర్టులో విడాకుల కేసు వేశాడు. అప్పటి నుంచి రామారెడ్డి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు.
తొమ్మిది నెలల క్రితమే హుకుంపేటకు..
కొంతకాలం మారేడుమిల్లిలో ఉన్న రామారెడ్డి, తొమ్మిదినెలల క్రితమే హుకుంపేటలోని బాలాజీ టవర్స్‌లోని ఫ్లాట్‌లోకి అద్దెకు వచ్చారు. అపార్టుమెంటువాసులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని చెప్పినట్టు సమాచారం. మారేడుమిల్లికి చెందిన గిరిజన యువతి చదల దుర్గాదేవి తన మేనకోడలు అని చదివిస్తున్నానని, రాజమహేంద్రవరానకి చెందిన యేరుకొండ శ్రీవిద్య, ఏడాది పాపతో తనతో పాటు తనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుందని తెలిపినట్టు స్థానికులు చెబుతున్నారు.
రెక్కీ నిర్వహించి మరీ..
వెలగల పట్టాభి రామారెడ్డిపై అతడి భార్య సూర్యవాణి, బావమరిది సత్తి శివకృష్ణారెడ్డి, కుమారులు నాలుగేళ్లుగా రెక్కీ నిర్వహిస్తూ వస్తున్నారు. మారేడుమిల్లిలో ఒకసారి అతడిపై హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయమే ఇద్దరు కుమారులు బాలాజీ టవర్స్‌కు వచ్చి తండ్రి రామారెడ్డిని కలిసి వెళ్లినట్టు సమాచారం. అర్ధరాత్రి వచ్చి హత్యకు పాల్పడినట్లు పక్కా ప్రణాళిక ప్రకారమే చేసినట్టు అర్థమవుతోంది. మరోవైపు రామారెడ్డిపై తాడేపల్లిగూడెం పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. అధికారులను ఏసీబీకి పట్టించడంలో దిట్ట. అధికారులను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. హత్య కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. సంఘటన స్థలాన్ని బొమ్మూరు పోలీసులు పరిశీలించి, క్లూస్‌టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ లతామాధురి, తూర్పు మండల డీఎస్పీ, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment