మాడ్రిడ్: సంచలనం రేపిన ప్యాంప్‌లోనా గ్యాంగ్ రేప్ కేసులో స్పెయిన్ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దుమారం రేపుతోంది. ఆమె ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొందని పేర్కొంటూ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే యువతిపై వేధింపులకు పాల్పడ్డారన్న నిర్ధారణకు వచ్చిన న్యాయమూర్తి.. నిందితులకు 9 ఏళ్ల జైలు శిక్షను విధించారు. స్పెయిన్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన ఈ కేసులో లోతుల్లోకి వెళ్తే...
రెండేళ్ల క్రితం ప్యాంప్‌లోనాలో బుల్ ఫైటింగ్ క్రీడల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న 18 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు(అంతా 20 ఏళ్లలోపు వాళ్లే) కారులోకి లాగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ ఘటనంతా వాట్సాప్‌లో వీడియోలుగా తీసి వైరల్ చేశారు. వీడియోల్లో ఆ యువకులు తాము డ్రగ్స్ ఇచ్చి యువతులపై ఇలా అత్యాచారానికి పాల్పడతామంటూ పేర్కొన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మరుసటి రోజే నిందితులను అరెస్ట్ చేశారు. ‘వోల్ఫ్ ప్యాక్(తోడేళ్ల మంద)’ కేసుగా రెండేళ్లపాటు స్పెయిన్‌లో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
జడ్జి అనూహ్య వ్యాఖ్యలు... విచారణ పూర్తికావటంతో గత గురువారం జడ్జి ఈ కేసులో తీర్పు వెలువరించారు. ఆ సమయంలో జడ్జి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ‘ఘటన జరిగిన సమయంలో వీడియోలను సాక్ష్యంగా చేసుకుని తీర్పు ఇస్తున్నాం. ఆ సమయంలో యువతి ఎలాంటి ప్రతిఘటన చెయ్యకుండా కళ్లు మూసుకుని ఉంది. అంటే ఇష్టపూర్వకంగానే ఆమె శృంగారంలో పాల్గొనట్లు తెలుస్తోంది. స్పెయిన్ క్రిమినల్ చట్టాలను అనుసరించి అత్యాచారం జరిగిన సమయంలో మహిళపై క్రూరమైన చేష్టలు జరగాలి. కానీ, ఈ కేసులో మహిళ సురక్షితంగానే ఉంది. అందుకే ఇది అత్యాచారంగా పరిగణించటం లేదు. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం. కానీ, ఆ యువకులు వైరల్ చేసిన వీడియోల ఆధారంగా ఆమెపై వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే వారికి 9 ఏళ్ల శిక్ష విధిస్తున్నాం’ అని న్యాయమూర్తి ప్రకటించారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం... ఈ తీర్పుపై స్పెయిన్ భగ్గుమంది. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. శనివారం సుమారు 35,000 మంది మహిళలు పాంపలోనాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆమెపై జరిగింది వేధింపులు కాదని.. అది ముమ్మాటికీ అత్యాచారమేనని మహిళలంతా ముక్తకంఠంతో నినదించారు. రేప్ జరిగిందని నిరూపించుకోవాలంటే బాధితురాలు చావాలా?. నిందితులకు మరణ శిక్షలు విధించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మాడ్రిడ్‌తోపాటు మరికొన్ని నగరాల్లో కూడా మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని.. జడ్జి రాజీనామాను కోరుతూ వారంతా నిరసనలు కొనసాగించారు. స్పెయిన్ న్యాయశాఖ మంత్రి రఫెల్ కటాలా కూడా కేసు విచారణలో జడ్జి తీరును తప్పుబట్టారు. మరోవైపు న్యాయవాదుల సంఘం జడ్జికి మద్ధతుగా నిలుస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోయిందని.. చట్టంలో సవరణలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ న్యాయశాఖ మంత్రికి చురకలు అంటించింది. తీర్పు నేపథ్యంలో క్యూఎంటాలో(నీ కథ చెప్పు...) పేరిట ఓ యాష్ ట్యాగ్ కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment