తోడికోడలుతో నలుమోలు లక్ష్మీప్రసన్న
గుంటూరు: నకిలీ న్యాయవాది మాటలు నమ్మి మోసపోయామంటూ ఓ బాధితురాలు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో రూరల్ ఎస్పీ సిహెచ్.వెంకటప్పలనాయుడు వద్ద కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి కథనం ప్రకారం... నరసరావుపేట కూరగాయల మార్కెట్ సెంటర్‌లో నలుమోలు లక్ష్మీప్రసన్న టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తున్నారు. 2016లో ఆమె భర్త స్నేహితుడు గిరికి అతని అవసరాల నిమిత్తం విడతలవారీగా రూ. లక్ష అప్పుగా ఇచ్చారు. అదేవిధంగా ఆమె భర్త సోదరుడు సుధీర్ కూడా విడతల వారీగా రూ. 2.50 లక్షలు గిరికి అప్పుగా ఇచ్చారు. ఏడాది గడిచినా డబ్బు ఇవ్వకపోవడంతో గిరి ప్రవర్తనపై అనుమానం కలిగిన బాధితులు న్యాయవాదినంటూ చెప్పుకొని తిరిగే అట్లూరి విజయకుమార్‌ను ఆశ్రయించారు. మీ డబ్బు వీలైనంత త్వరలో తిరిగి ఇప్పిస్తానని విజయకుమార్ నమ్మబలికి న్యాయవాది ఫీజు రూ. 30 వేలు తీసుకోవడంతోపాటు, గిరి రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటును బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
అనంతరం గిరితో మాట్లాడి బాధితులకు రూ. 50వేలు ఇప్పించాడు. గిరి కొంత సమయం కోరవడంతో అందుకు విజయకుమార్ సలహా మేరకు అంగీకరించారు. చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వకపోవడంతో గిరిని నిలదీస్తే అసలు విషయం బయటపడింది. తాను ఇవ్వాల్సిన రూ. 3 లక్షలను విజయకుమార్ తీసుకెళ్లాడని చెప్పాడు. బాధితులకు విజయకుమార్ తీరుపై అనుమానం కలిగి విచారిస్తే అసలు అతను న్యాయవాది కాదని తేలింది. దీంతో తాము మోసపోయామని భావించి గిరి వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని విజయకుమార్‌ను పలు మార్లు కోరినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఎస్పీని ఆశ్రయించారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే నరసరావుపేట –2 టౌన్ సీఐకు ఫోన్ చేసి విచారించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment