తరుణ్ కుమార్(ఫైల్)
ఖిల్లాఘనపురం (వనపర్తి): కుటుంబ కలహాలతో కుమారుడితో సహా చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన ఓ మహిళ భయంతో కుమారుడిని మాత్రం నీటిలో వదిలి బయటకు పరుగు తీసింది. మండలంలోని వెంకటాయపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బాలుడు నీటిలో మునిగి మృతిచెందగా మూడు రోజుల తర్వాత శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గెర్ల భాగన్న, ముణెమ్మల కూతురు సుమతిని నాగర్‌కర్నూల్ మండలం బొందలపల్లికి చెందిన కరుణాకర్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు.
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన సుమతి తన కుమారుడు తరుణ్‌కుమార్(2)తో కలిసి ఈ నెల 28వ తేదీన బొందలపల్లి నుంచి తల్లిగారింటికి బయలుదేరింది. గ్రామ సమీపానికి రాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని పక్కనే ఉన్న గణపసముద్రం చెరువులో పడి చనిపోదామని నిర్ణయించుకుంది. రాత్రి 8 గంటల సమయంలో కత్తి నర్సిహులు పొలం దగ్గర ఖిల్లాఘనపురం గణపసముద్రంలోకి వెళ్లింది. కొంత లోపలికి వెళ్లగానే లోతు ఎక్కువగా ఉండటంతో భయపడి బాలుడిని నీటిలోనే వదిలి పరుగున బయటకు వచ్చింది.
రెండురోజులపాటు అక్కడే..
కుమారుడిని కాపాడుకోవాలని ఉన్నా నీటిలోకి దిగే సాహసం చేయలేకపోయింది. చేసేదిలేక సమీపంలోని సౌడమ్మ గుట్టపై ఉన్న బ్రంహ్మంగారి ఆలయం దగ్గర రాత్రి మొత్తం తలదాచుకుంది. కుమారుడు చెరువులో మృతిచెందాడని గమనించిన ఆమె అటు అమ్మగారి ఇంటికి.. ఇటు భర్త దగ్గరకు వెళ్లలేక గుట్టపైనే రెండు రోజుల పాటు ఉండిపోయింది. శుక్రవారం ఉదయం ఖిల్లాఘనపురంలో ఉన్న తన సొంత అక్క కుర్వ జయమ్మ దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది.
ఆమె వెంటనే తల్లిదండ్రులకు చెప్పడంతో అందరూ వచ్చి సుమతి చెప్పిన ప్రాంతంలో నీటిలో వెతికారు. ఓ చెట్టుకు బాలుడి మృతదేహం తట్టుకుని ఉండటంతో బయటకు తీశారు. మృతదేహాన్ని చూసి తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా బోరుమని విలపించారు. బాలుని తండ్రి కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment