
ప్రతీకాత్మక చిత్రం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): ఇంటి పక్కన డబ్బాలో వేసిన చెత్త ఇంట్లోకి వస్తుందని పక్కింటి మహిళతో వాగ్వాదానికి దిగిన ఓ వివాహిత మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని చౌదరిగూడలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బక్క సుమలత కూలీ పని చేస్తుంది.
వీరి ఇంటి వెనుక బక్క కళమ్మ ఇల్లు ఉంది. కళమ్మ తన ఇంట్లోని చెత్తను ఓ డబ్బాలో వేసి సుమలత ఇంటి పక్కన పెడుతుంది. గాలికి ఈ చెత్త డబ్బాలో నుంచి ఎగిరి వచ్చి సుమలత ఇంట్లోకి వస్తోంది. చెత్త డబ్బాను అక్కడ నుంచి తీసివేయాలని సుమలత ఎన్నిసార్లు చెప్పినా కళమ్మ వినిపించుకోలేదు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య వివాదం జరిగింది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి సమయంలో గాలికి డబ్బాలోని చెత్త ఇంట్లోకి రావడంతో సుమలత వెళ్లి కళమ్మను అడిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. సుమలతను బెదిరించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపానికి గురైంది.
ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. గమనించిన చుట్టు పక్కల వారు మంటలార్పి 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సుమలత మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment