భర్త బాల్యనాయక్‌ను విచారిస్తున్న పోలీసులు, అనిత మృతదేహం
ధన్వాడ(నారాయణపేట): మండలంలోని కిష్టాపూర్ పంచాయతీలోని మూలతండాలో మంగళవారం ఉదయం అనిత(23) హత్యకు గురైంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాలు... మూలతండాకు చెందిన బాల్యనాయక్‌కు అనితతో ఆరేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలను నానమ్మ వద్ద ఉంచి వీరు బతుకుదెరువు కోసం పూణె వెళ్లి అక్కడే నివసిస్తున్నారు.
పిల్లలను చూసేందుకు నాలుగు రోజుల క్రితం తండాకు వచ్చారు. మంగళవారం ఉదయం 7గంటల సమయంలో అనిత తన మేనల్లుడి(4)ని తీసుకొని పక్కనే ఉన్న తమ పొలంలో కంది కట్టెల కోసం వెళ్లింది. కొద్దిసేపటికే మేనల్లుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం 9గంటలైనా ఇంకా అనిత ఇంటికి రాకపోవడతో మరదలు వరసైన చిట్టెమ్మ పొలానికి వెళ్లింది. అప్పటికే అనిత మృతిచెందింది. స్థానికులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమచారం అందించారు.
భార్యను కడతేర్చిన భర్త
మృతదేహం వద్దకు చేరుకున్న ధన్వాడ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ జానకిరాంరెడ్డి, అనిత మృతి విషయమై ఆమె భర్త బాల్యనాయక్‌ను అడిగారు. పొంతన లేకుండా మాట్లాడడంతో అనుమానం వచ్చి, విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య పూణెలో మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, గ్రామానికి వచ్చిన తర్వాత కూడా ఫోన్‌లో మాట్లాడుతోందని తెలిపాడు. అందుకే చంపానని విచారణలో వెల్లడించాడు. కర్చిఫ్ గొంతుకు బిగించి హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా తండాకు వెళ్లిపోయాడని ఎస్‌ఐ జానకిరాంరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment