మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఆశప్పకు చికిత్స చేస్తున్న సిబ్బంది, (ఇన్‌సెట్)లో దాడికి ఉపయోగించిన వేటకొడవలి
మరికల్ / మహబూబ్‌నగర్ క్రైం : పాలమూరులో పాత రోజులు పునరావృతం అవుతున్నాయా.. ఇటీవల, తాజాగా జరిగిన సంఘటనలను బట్టి చూస్తే నిజమేననిపిస్తోంది. బుధవారం మరికల్ సమీపంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొన్నిరోజులుగా ప్రశాంతంగా ఉంటున్న పాలమూరు జిల్లాలో వేట కొడవళ్ల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా భూ తగాదాలు, పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై వేట కొడవలితో దాడి జరగడం సంచలనం రేకెత్తించింది.
పక్కా ప్లాన్‌తో దాడి
నారాయణపేట మండలం అభంగాపూర్‌కు చెందిన ఆశప్ప అలియాస్ అశోక్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం స్వగ్రామం నుంచి నారాయణపేటకు వచ్చాడు. అక్కడి నుంచి తన కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. అయితే అతని కదలికలను గమనిస్తూ వెంటాడిన దుండగులు సరిగ్గా రాత్రి 8 గంటల సమయంలో కారు మరికల్ బీసీ కాలనీ వద్దకు రాగానే అడ్డగించారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఆశప్పను వెంట తెచ్చుకున్న వేట కొడవలితో తలపై నరికారు.
అనంతరం కత్తిని అక్కడే పడేసి పారిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో సంఘటన గురించి వెంటనే ఎవరికీ తెలియరాలేదు. తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆశప్ప తువాల చుట్టుకున్నాడు. కాసేపటి తర్వాత గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే సీఐ ఇఫ్తెఖార్ అహ్మద్, ఎస్‌ఐ జానాకీరాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తంతో నిండిన ఆశప్పను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
పాతకక్షలే కారణం : డీఎస్పీ
సంఘటన గురించి ఆరా తీసిన నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పాత కక్షల కారణంగా దాడి జరిగిందని, ఆశప్ప బతికే ఉండటంతో మళ్లీ దాడి అవకాశం ఉందని తెలిపారు. సంఘటన పునరావృతమై మరిన్ని దాడులు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులకు, పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా ఆశప్పపై గతంలో పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు తెలిసింది. భూ సెటిల్‌మెంట్లు, పంచాయతీలు, పైరవీలు చేస్తుండేవాడని సమాచారం. ఈ క్రమంలో గతంలో జరిగిన పాత కక్షలను మనసులో పెట్టుకొని ఓ ముఠా సభ్యులు వెంటాడి దాడికి పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
గాయపడిన ఆశప్పను పోలీసులు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు చికిత్సలు అందించగా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే హైదరాబాద్‌కు రెఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment