
ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీదేవి
తాండూరు: ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు.. కొడుకు కోసం మరో పెళ్లి చేసుకుంటానని భర్త తరచూ వేధించడంతో మనస్థాపం చెందిన భార్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రతాపలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాకు చెందిన గంగిరెడ్డి లక్ష్మీదేవి(35)కు అదే జిల్లాకు చెందిన శంకరనారాయణరెడ్డితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో తాండూరుకు వలస వచ్చి నాపరాళ్ల వ్యాపారం చేస్తూ శంకర్‌నారాయణ తాండూరులో కుటుంబ సభ్యులతో కలిసి స్థిరపడ్డాడు. అయితే వీరికి ఇద్దరు ఆడపిల్లలు లాసిని(9), హాసిని(8) ఉన్నారు. కొడుకును కనలేదని భర్త శంకర్‌నారాయణరెడ్డి భార్యను సూటిపోటి మాటలతో వేధించే వాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ శంకర్‌నారాయణరెడ్డికి కొడుకు లేని లోటు వేధించసాగింది. కొడుకు కోసం మరో పెళ్లి చేసుకుంటానని తరచూ భార్య లక్ష్మీదేవిని మాటలతో చిత్రహింసలకు గురి చేసేవాడు. భర్త వేధింపులను భరించలేక మనస్థాపం చెంది శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం కుటుంబ సభ్యులు గమనించి తాండూరు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రతాపలింగం సంఘటన స్థలంలో విచారణ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను సేకరించారు. అనంతరం మృతదేహన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మారం రంగారెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment