
బెంగళూరు : బైక్‌పై ఇంటికి వెళ్తున్న కార్మికుడిని దుండగులు అడ్డగించి దారుణంగా హత్య చేసిన ఘటన మైకో లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.... పుట్టేనహళ్లి లక్ష్మీలేఔట్ నివాసి యూసూఫ్ (25) వెల్డింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం అర్ధరాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లి పార్టీ ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో మైకోలేఔట్ బీలేకహళ్లి వద్ద దుండగులు అడ్డుకుని చాకుతో పొడిచి దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.
హతుడు యూసూఫ్‌తో మరో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. త్రికోణ ప్రేమే హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గకు చెందిన యూసూఫ్ ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో జైలుకెళ్లి జామీనుపై విడుదలయ్యాడు. అనంతరం ఇతడి తల్లిదండ్రులు బెంగళూరు నగరానికి తీసుకువచ్చి వెల్డింగ్ పనిలో పెట్టారు. కానీ అతడి ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. విధులు నిర్వహించే దుకాణంలో గొడవపడి ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్ ఇతడిపై కేసు నమోదైంది. మైకో లేఔట్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.