జాతీయ రహదారిపై ప్రమాద స్థలంలో లారీ, బైక్ (ఇన్‌సెట్) వెంకటేష్
పీఎం పాలెం(భీమిలి):విధి చాలా విచిత్రమైనది. ఎప్పుడు ఎవరిని ఎలా కాటేస్తుందో... ఎవరి ఆశలు ఎలా చిదిమేస్తుందో ఎవరికీ అంతుబట్టదు. అప్పటి వరకు సంతోషంగా సాగిపోతున్న కుటుంబంలో ఒక్కసారిగి విషాదం నింపేసి రోడ్డు మీదకు లాగేస్తుంది. అలాంటి హృదయవిదారకర ఘటనే ఆదివారం నగర శివారులో చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని మారికవలస రాజీవ్ గృహకల్ప సముదాయంలో బ్లాకు నంబరు 27లో భార్య, ఇద్దరు కుమారులతో కెళ్లా వెంకటేశ్వరాచారి నివసిస్తున్నాడు. చిన్న కుమారుడు ఇంటర్ చదువుతుండగా పెద్ద కుమారుడు వెంకటేష్ (25) నగరంలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబానికి చేదోడుగా ఉంటూ ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు.
మధురవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న తమ్ముడు వినోద్‌బాబుకు, అమ్మానాన్నలకు వెంకటేష్ పెద్ద దిక్కు. రోజూలాగే విశాఖ నగరానికి ఆదివారం ఉదయం 9 గంటకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి వెంకటేష్ బయలుదేరాడు. 9.30 గంటల సమయంలో క్రికెట్ స్టేడియానికి ఎదురుగా ఉన్న జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చే సరికి రోడ్డుకు అడ్డంగా నడుస్తున్న వ్యక్తిని తప్పించ బోయి బైకు పైనుంచి కింద పడిపోయాడు. ఆ సమయంలో అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న లారీ అతని పైనుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఈ దుర్ఘటనతో మారికవలస రాజీవ్ గృహకల్ప సముదాయంలో విషాదం అలుముకుంది. అన్నలేని జీవితం అగమ్య గోచరంగా మారిందని... పెద్ద చదువులు చదివించాలని తపన పడే అన్నయ్య ఆకస్మిక మరణం తట్టుకోలేకపోతున్నానని మృతుని సోదరుడు వినోద్‌బాబు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తన చదువు ఎలా కొనసాగుతుందో అర్థం కావడం లేదని, మా కుటుంబానికి తీరని నష్టం జరిగిందని విలపిస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూపరులను కలిచివేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment