
పెళ్లి పత్రిక, రైలు కిందపడటంతో రెండుకాళ్లు తెగిన దృశ్యం
మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగనుంది. ఇప్పటికే బంధు,మిత్రులందరికి పెళ్లి పత్రికలు అందజేసి వివాహానికి ఆహ్వానించారు. మిగిలిన వారిని పెళ్లికి పిలిచేందుకు ఇంటి నుంచి బయలుదేరిన యువకుడు రైలు కిందపడి మృత్యువాత పడ్డాడు. పెళ్లి జరగాల్సిన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
వైఎస్‌ఆర్ జిల్లా, నందలూరు : నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన కాశి యాసిరాజు అలియాస్ కాశి బాబు కుమారుడు కాశి శ్యాం (25)కు ఈనెల 12వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు వివాహ పత్రికలు పంచేందుకు ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నందలూరు ఆల్విన్ కర్మాగార సమీపంలో ముంబై నుంచి చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైలుకింద పడటంతో రెండు కాళ్లు తెగిపోయాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి రాజంపేట ›ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగాల్సిన పరిస్థితిలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు, బం«ధువులు, స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసుల దర్యాప్తులో సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment