
శ్రీనివాసమూర్తి
కడప అర్బన్ : కడప రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడప– రాజంపేట రైలు మార్గంలో సింగపూర్ టౌన్‌షిప్ సమీపంలో తిరుపతి నుంచి వస్తున్న హరిప్రియ రైలులో ప్రయాణిస్తున్న శ్రీనివాసమూర్తి(56) జారిపడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనపై అదే రోజు శ్రీనివాసమూర్తి బంధువులు ఆయన తమతోపాటు ప్రయాణిస్తూ కన్పించలేదని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి, అతని కోసం ఒక వైపు బంధువులు, మరోవైపు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆయనకు రేచీకటి వుందని, బాత్‌రూంకు వెళ్లి, కనిపించక ప్రమాదానికి గురై వుండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని ఆదివారం కడప నగర శివార్లలోని సింగపూర్ టౌన్‌షిప్ సమీపంలో పడి వుండటాన్ని రైల్వే కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని రైల్వే ఎస్‌ఐ రారాజు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసుపై విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.