సాక్షి, అన్నానగర్: నాగైలో దారుణం జరిగింది. స్నేహితులే చిన‍్న తగాదా కారణంగా మరో స్నేహితుని తల నరికి హతమార్చారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పాతిపెట్టిన ఆ యువకుడి మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నాగై భారతి మార్కెట్ ప్రాంతానికి చెందిన మదియళగన్ (24), సరన్‌రాజ్ (26), విజయ్ (23), మారియప్పన్ (26), శివా (24), జయరామన్ (26) మంచి స్నేహితులు. సరన్‌రాజ్, విజయ్, మారియప్పన్, శివా, జయరామన్ గత నెల 31వ తేదీ రాత్రి నాగై బాప్పాన్ శ్మశానవాటిక ప్రాంతంలో మద్యం సేవించారు. అప్పుడే అక్కడికి వచ్చిన మదియళగన్ నన్ను వదిలివేసి మీరు మద్యం సేవిస్తున్నారా అని స్నేహితులను అడిగాడు. దాంతో వారి మధ‍్య గొడవ జరిగింది.
మదియళగన్ సమీపంలో ఉన్న బీర్ బాటిల్ తీసుకుని జయరామన్‌ని పొడవటానికి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ఐదుగురు స్నేహితులు వారి వద‍్ద ఉన‍్న కత్తితో మదియళగన్‌ను పొడిచారు. దాంతో అతను అక‍్కడికక‍్కడే మృతి చెందాడు. మత్తులో ఉన‍్న వారు అంతటితో ఆగక మదియళగన్ తలను నరికి దేహాన్ని, తలని సమీపంలో ఉన్న కాలువ పక్కన గుంత తవ్వి పాతిపెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
మదియళగన్ అదృశ‍్యంపై కుటుంబసభ‍్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులకు అనుమానం వచ్చి అందుబాటులో ఉన‍్న నలుగురు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల ఎదుట వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. అనంతరం బుధవారం సాయంత్రం మదియళగన్‌ని పాతిపెట్టిన స్థలానికి నిందితులను తీసుకుని వెళ్ళి మృతదేహాన్ని వెలికితీశారు. తరువాత పోస్టుమార్టం కోసం మదియళగన్ మృతదేహాన్ని నాగై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న మరో స్నేహితుడు జయరామన్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment