
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగుళూరు : స్కూలుకు ఆలస్యంగా వెళ్లాడని తల్లి కొట్టడంతో ఓ యువకుడు (18) రైలుకింద దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బెంగుళూరు మెట్రో స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. అయితే, రైలు డ్రైవర్ అప్రమత్తం కావడంతో యువకుడు చావు నోట్లో తల పెట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడప్పుడే వేగం అందుకుంటున్న రైలు ముందు సదరు విద్యార్థి దూకడం చూసిన డ్రైవర్ మదివలప్ప ఒక్కసారిగా సడెన్ బ్రేకులు వేశాడు. దాంతో ప్రాణభయంతో యువకుడు పట్టాల పైనుంచి పక్కకు తొలగి భూమ్మీద నూకలు నిలుపుకున్నాడు. కానీ, ట్రాక్‌పై దూకడంతో అతని తలకు బలమైన గాయాలైనట్టు బెంగుళూరులోని నిమ్‌హాన్స్ హాస్పిటల్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్) వైద్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి పరామర్శ
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యువకుడిని సీఎం హెచ్‌డీ కుమారస్వామి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్నచిన్న విషయాలకే తొందరపడి కొందరు ప్రాణాలు తీసుకోవడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులు అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.