సంపూర్ణ ఉరఫ్ చాందిని (ఫైల్) ,హత్యకేసులో నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపెట్టి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, సీఐ శుభకుమార్
వైఎస్‌ఆర్ జిల్లా, రాజంపేట: మహిళ మృతి మిస్టరీ వీడింది. గత నెల 21న కడప–తిరుపతి బైపాస్‌రోడ్డులో చిల్లీస్‌డాబా వెనుక గల బీడు పొలంలో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పట్టణ సీఐ శుభకుమార్ సంఘటన స్థలంలో లభ్యమైన పర్సుతో కేసును చేధించారు. మృతురాలు ఒంటిమిట్ట మండలంలోని నడింపల్లె గ్రామానికి చెందిన బిల్లా సంపూర్ణ ఉరఫ్ చాందిని అని, ఆమెను హత్య చేసిన వ్యక్తి వేముల మండలం కొత్తపల్లెకు చెందిన నల్లబల్లె సాంబశివ అని తేల్చారు. ఈ మేరకు సోమవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, సీఐ శుభకుమార్ విలేకరులతో మాట్లాడారు. నిందితుడు సాంబను హాజరుపెట్టారు. వివరాల్లోకి వెళితే. నెల్లూరు జిల్లా సాతుపల్లెకు చెందిన బిల్లా సంపూర్ణ (36)కు, ఒంటిమిట్ట మండలంలోని నడింపల్లెకు చెందిన లక్ష్మీనరసయ్యతో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. చెన్నైలో చీనీకాయల వ్యాపారం చేస్తూ 2009లో భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత రాజంపేటకు చెందిన హుసేన్‌బాషతో సంపూర్ణ కొద్దిరోజులు సహజీవనం చేసింది. (ఈమె.. ఆమేనా..? )
పులివెందుల, వేంపల్లె, కదిరిలో కొద్దిరోజులు కాపురం కొనసాగించారు. కదిరి నుంచి వేంపల్లెకు ఇల్లు మారే సమయంలో సాంబ ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో సంపూర్ణతో సాంబ«కు వివాహేతర సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని ఆమె డబ్బుతో ఐదు ఎకరాలు పొలం తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కాగా కొంత కాలానికి ఆమె వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. లేకుంటే తన డబ్బుతో కొనుగోలు చేసిన పొలంను ఇచ్చేయాలనే అంశంపై ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గత నెల 20న రాజంపేట పట్ణణంలోని జాఫర్ అనే వ్యక్తి వద్ద డబ్బు తీసుకోవడానికి సాంబ, సంపూర్ణలు బైకుమీద వచ్చారు. అప్పటికే ఆమెను వదలించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్న సాంబ చిల్లీస్ డాబా వెనుక వైపు ఉన్న బీడు స్థలంలోకి సంపూర్ణను తీసుకెళ్లాడు. కలిసి భోజనం చేసేందుకు ఉపక్రమించిన పరిస్థితిలో ఇద్దరి మధ్య పెళ్లి, ఆస్తి గొడవలు తలెత్తాయి. దీంతో రాయి తీసుకొని ఆమె తలపై కొట్టాడు. కిందపడిన ఆమెను చీరకొంగుతో మెడకు బిగించి చంపేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు చైను తీసుకొని బైకు లో తిరుపతి వైపు పారిపోయాడు. కాగా సంఘటన స్థలంలో మృతురాలి వద్ద పర్సు ఉంది. అది బంగారు దుకాణం వారు ఇచ్చినది. ఆ పర్సు ఆధారంగా బంగారు దుకాణం నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఇదిలా ఉండగా సంపూర్ణ రాజంపేటకు వచ్చేటపుడు తన సోదరికి ఫోన్ ద్వారా రాజంపేటకు వస్తున్నానని తెలిపింది. ఆ ఫోన్‌కాల్స్ నుంచి సాంకేతికంగా దర్యాప్తు చేసి, హత్యకు పాల్పడిన సాంబను కడప–తిరుపతి బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. కోర్టుకు హాజరుపరిచి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. (టీవీ నటి ఆత్మహత్య )
Comments
Please login to add a commentAdd a comment