ప్రొద్దుటూరు క్రైం : తాగుబోతు భర్త రోజూ వేధించే వాడు. అయినా సహించింది. బుధవారం రాత్రి యాసిడ్ పోసే ప్రయత్నం చేశాడు. ప్రాణ రక్షణ కోసం ఆమె ప్రెషర్ కుక్కర్‌తో తలపై మోదింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామేశ్వరానికి చెందిన దొర్నిపాటి నాగేశ్వరరావు (45), భార్య లక్ష్మీశ్రీదేవికి బాలసుబ్రమణ్యం, దుర్గాసాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావుకు సొంత లారీ ఉంది. బాడుగలు ఒప్పుకొని అతనే డ్రైవర్‌గా వెళ్తుంటాడు. రోజూ మద్యం సేవించి భార్య, కుమారులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి పొద్దుపోయే వరకు భార్య, కుమారులతో గొడవ పడి వారిని కొట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకొని.. వారిపై పోసే ప్రయత్నం చేశాడు. ప్రాణ రక్షణ కోసం ఆమె ప్రెషర్ కుక్కర్ తీసుకొని భర్త తలపై బలంగా కొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. రక్తస్రావం ఎక్కువై కొద్ది సేపటి తర్వాత మృతి చెందాడు. డీఎస్పీ సుధాకర్, సీఐ నాగరాజు గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చెరువులో గుర్తుతెలియని మృతదేహం
వేంపల్లె : నందిపల్లె సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్‌ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. చెరువులో 35 ఏళ్ల యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. గ్రామస్తులు పోలీ సులకు గురువారం సమాచారం అందించారు. ఆ చుట్టు పక్కల గ్రామాలకు సంబంధించిన యువకుడు కానందున ఎవరనేది తెలియడం లేదని ఎస్‌ఐ పేర్కొన్నారు. నలుపుగా ఉన్న మృతుని శరీరంపై కాఫీ రంగు దుస్తులున్నాయి. అతనే ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా చంపి పడేశారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి దారుణ హత్య
చింతకొమ్మదిన్నె : కడప నగర పరిధి 45వ డివిజన్‌లోని భగత్‌సింగ్ నగర్‌లో బుధవారం అర్ధరాత్రి నాగేంద్ర (40)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సూర్యనారాయణ, తాలూకా సీఐ నాగభూషణం గురువారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగేంద్ర కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడు. బుధవారం అర్ధరాత్రి తన ఇంటి వద్ద గల వసారాలో నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై రోకలిబండతో మోది, కత్తులతో దాడి చేసి హత మార్చారు. నిందితుల కోసం పోలీసులు జాగిలాలతో వెతికారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. వారిని పట్టుకుంటే ఎందుకు చేశారనే విషయం తెలుస్తుందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. నాగేంద్రకు భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. డీఎస్పీ వెంట తాలూకా ఎస్‌ఐలు మహ్మద్ హుస్సేన్, రాఘవేంద్రారెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment