ఘనంగా ముగిసిన బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: మునుపెన్నడూ లేనంత ఘనంగా ఈసారి అమెరికాలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తెలుగు సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన ఈ సంబురాల్లోని చివరి రోజు వేడుకను డా.పెప్పర్ ఆరియన్ లో నిర్వహించారు. దాదాపు పది వేల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 1500 మంది మహిళలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు.
అమెరికా మొత్తంలో ఇక్కడే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశి కన్నన్, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్లు టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు తదితరులు చేపట్టారు.