అట్టహాసంగా ప్రారంభమైన దసరా-బతుకమ్మ సంబరాలు
డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) ఆధ్వర్యంలో దసరా-బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా చివరి రోజైన అక్టోబర్ 8న డా.పెప్పర్ ఆరియన్ లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. చివరిరోజు వేడుకలకు దాదాపు 10వేల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు కార్యక్రమ నిర్వహకులు వెల్లడించారు. అదే సమయంలో 1500 మంది మహిళలు బతుకమ్మ పాటలతో బతుకమ్మ ఆటలు ఆడుతారు.
అమెరికాలో ఇదే అతిపెద్ద బతుకమ్మ ఉత్సవం కావడంతో ఉత్సవాలకు సినీనటులు, రాజకీయ ప్రముఖులు పలువురు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. బుల్లితెర యాంకర్, నటీ శ్రీముఖి, అందాల తార రాశి కన్నన్, రెజీనా, ఈషా రెబ్బా, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, సినీనటి ఆర్కే రోజా, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, గాయనీగాయకులు గీతా మాధురీ, సతీష్, నరేంద్ర తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరణ్ పోరెడ్డి, జాయింట్ సెక్రటరీ రమణ లష్కర్లు టీపీఏడీ చైర్మన్ అజయ్ రెడ్డి, వైస్ చైర్మన్ రఘువీర్ బండారు తదితరులు చేపట్టారు.