నాణ్యతపై ‘యంత్ర’దండం
-
ఆర్‌అండ్‌బీ రహదారుల దృఢత్వం గుర్తింపునకు జిల్లాకు వచ్చిన అత్యాధునిక వాహనం
కాకినాడ సిటీ :
వేసిన రోడ్లు కొద్ది కాలానికే గోతులమయమవుతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదా?
అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందా?అసలు రోడ్లలో దృఢత్వమెంత..? తెలుసుకునేందుకు అధునాతన యంత్రాలు జిల్లాకు వచ్చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారుల దృఢత్వం ఏ మేరకు ఉందో పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక అత్యాధునిక వాహనం(ఫాలింగ్ డిఫెక్ట్ మీటర్) జిల్లాకు వచ్చింది. సోమవారం ఆ వాహనాన్ని కాకినాడ ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లలోని రహదారులలో డిజిటల్ సర్వే చేయించి గోతులు, ఎత్తు పల్లాలను లేజర్స్ ఉపయోగించి వీడియోగ్రఫీ తీయించామన్నారు. ఇప్పుడు ఈ ప్రత్యేక వాహనం ద్వారా రహదారుల దృఢత్వం, సాయిల్ కండీషన్‌ను గుర్తిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,500 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారుల్లో కిలోమీటరుకు మూడు పాయింట్లతో రోజుకు 50 కిలోమీటర్లు చొప్పున 75 రోజుల పాటు గుర్తింపు ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రెండు ప్రత్యేక వాహనాలు తిరుగుతున్నాయని వాటిలో ఒకటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిందన్నారు.