
రహదారి ‘నాణ్యత’ పరిశీలన
చేవెళ్ల: చేవెళ్ల నుంచి కందవాడ- నక్కలపల్లిల మీదుగా వెంకటాపూర్ వరకు చేపట్టిన రోడ్డు పనులను క్వాలిటీ కంట్రోల్ ఉన్నతాధికారులు సోమవారం పరిశీలించారు. జాతీయ రహదారుల క్వాలిటీ కంట్రోల్ ఉన్నతాధికారి చౌదరీరంజిత్‌సింగ్ నేతృత్వంలోని బృందం సభ్యులు పనుల వివరాలను తెలుసుకున్నారు. ప్రధానమంత్రి సడక్‌యోజన కింద 12.4 కిలోమీటర్ల రోడ్డు ఫార్మేషన్, పటిష్టత, బీటీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6.73 కోట్లు మంజూరు చేసింది. చేవెళ్ల నుంచి షాబాద్, కందవాడ మీదుగా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి నుంచి వెంకటాపూర్ వరకు చేపట్టిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. నాణ్యత కూడా బాగుందని తెలిపారు. ఈ రోడ్డుతో ఎన్ని గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది, ఎప్పటిలోగా రహదారిని అందుబాటులోకి తెస్తారని ఈఈ రవీందర్‌రెడ్డి, కాంట్రాక్టర్ కె.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వచ్చే మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని వారు అధికారులకు తెలిపారు. పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ భాస్కర్‌రెడ్డి, పీఆర్ ఏఈలు శేఖర్, రాజు, సైట్ ఇంజినీర్ గోపాల్ తదితరులు ఉన్నారు.