చేపల పేరు.. బ్యాంక్‌ను ముంచేశారు | చేపల పేరు.. బ్యాంక్‌ను ముంచేశారు | Sakshi
Sakshi News home page

చేపల పేరు.. బ్యాంక్‌ను ముంచేశారు

Published Tue, Nov 1 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

చేపల పేరు.. బ్యాంక్‌ను ముంచేశారు

చేపల పేరు.. బ్యాంక్‌ను ముంచేశారు

భీమవరం :
పేదోళ్లకు రూ.10 వేలు రుణం ఇవ్వాలంటే సవాలక్ష ఆంక్షలు విధించి.. పూచీకత్తులు అడిగే బ్యాంకులు బడాబాబులు, మోసగాళ్లకు మాత్రం కోట్లాది రూపాయల్ని దోచిపెడుతున్నాయి. భీమవరంలో ఇలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. టౌటూన్‌ ప్రాంతంలోన రూ.3 కోట్ల విలువైన ఒక లాడ్జిని బ్యాంకులో కుదువబెట్టి.. చేపల పెంపకానికంటూ ఓ ఆసామి 2009లో ఏకంగా రూ.11 కోట్లను రుణంగా పొందాడు. అప్పటినుంచి పైసాకూడా చెల్లించకపోవడంతో బ్యాంక్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వ్యవహారంపై విచారణ జరపగా, విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మోసపోయామని తెలుసుకున్న బ్యాంక్‌ అధికారులు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా రూ.3 కోట్ల విలువైన సదరు ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌కు టోకరా వేసిన వ్యక్తి తరఫున అధికార పార్టీకి చెందిన నాయకులు రంగంలోకి దిగారు. ఆ ఆస్తిని బ్యాంక్‌కు ఇచ్చేది లేదని, ఎంతోకొంత సొమ్ము కట్టించుకుని సెటిల్మెంట్‌ చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక బ్యాంక్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
ఊరుపేరూ లేకపోయినా..
రుణాలిచ్చే సందర్భంలో బ్యాంకులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తాయి. హామీగా పెట్టే ఆస్తిపాస్తుల వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాయి. కానీ.. ఈ వ్యవహారంలో బ్యాంక్‌ అధికారులు కనీస ప్రమాణాలు కూడా పాటించలేదనే విషయం రూఢీ అవుతోంది. ఓ ఆసామికి చెందిన లాడ్జిని హామీగా పెట్టుకుని 12మంది పేరిట రూ.11 కోట్ల రుణం మంజూరు చేశారు. రుణగ్రస్తులు ఏ ఊరు వారు, వారి తల్లిదండ్రులెవరనే వివరాలు లేకుండానే రుణం ఇవ్వడం, ఆ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయకుండా ఒకే వ్యక్తికి ఇవ్వడం వెనుక బ్యాంక్‌ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే.. బ్యాంక్‌కు కుదువబెట్టిన 18 సెంట్ల స్థలం, అందులో నిర్మించిన మూడు అంతస్తుల లాడ్జి విలువ రుణం పొందేనాటికి రూ.3 కోట్లు. అయితే, టోకరా వేసిన వ్యక్తి, బ్యాంక్‌ అధికారులు, కుమ్మక్కై దాని విలువను రూ. 17 కోట్లుగా చూపించారు. రుణం కాల పరిమితి మించిపోవడంతో 2013 డిసెంబర్‌ 5న నోటీసులు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపిస్తున్నా.. రుణగ్రహీతలకు 2016 ఆగస్టులో నోటీలు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది చర్చనీయాంశమైంది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణం, వడ్డీ కలిపి 2013 జూన్‌ నాటికి రూ.14 కోట్లకు చేరగా, మూడున్నరేళ్లతో ఆ మొత్తం దాదాపు రూ.20 కోట్లకు చేరింది. మరోవైపు చేపలు పెంచుతున్నామంటూ చూపించిన చెరువుల పత్రాలు కూడా అసలైనవి కావని సమాచారం. ఇదిలావుంటే.. లాడ్జిని బ్యాంకులో కుదువపెట్టిన ఆస్తికి సంబంధించి భీమవరం మునిసిపాల్టీకి 2008 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.23 లక్షల పన్ను చెల్లించలేదు. బ్యాంక్‌ నుంచి రుణం పొందే ఆస్తిపై పన్నుల చెల్లింపునకు సంబంధించి విధిగా ’నో డ్యూస్‌’ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లక్షలాది రూపాయల పన్ను బకాయి ఉన్నా మునిసిపాలిటీ నుంచి సదరు పత్రాలు పొందటం వెనుక పెద్దల హస్తం ఉందని చెబుతున్నారు. వాస్తవాలను గమనించిన బ్యాంక్‌ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడంతో రాజకీయ పెద్దలు రంగంలోకి దిగారు. కొద్దిమొత్తంలో బకాయి చెల్లించి.. వసూలు కాని బకాయిల జాబితాలో చేర్చడం ద్వారా రుణాన్ని ఎగవేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెరవెనుక ఓ ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి పావులు కదుపుతుండటంతో ఆస్తి స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేసినా.. బ్యాంక్‌ అధికారులు బకాయి రాబట్టుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
    
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement