ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు..
ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు..
Published Mon, Aug 1 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
బాల్కొండ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 42 వేల క్యూసెక్కులతో ప్రారంభమైన వరద నీరు మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షా 42 వేల క్యూసెక్కులకు చేరుకుంది. తర్వాత క్రమంగా తగ్గుతూ 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఒక్క రోజు వ్యవధిలో 5.5 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల క్యాచ్‌మెంట్ ఏరియాలో 33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధతి పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీలు) అడుగులు కాగా, సోమవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1076.60 (43.51 టీంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. ఎస్సారెస్పీకి ఎగువనగల మహారాష్ట్రలోని విష్ణు పురి ప్రాజెక్ట్ నుంచి ఆదివారం రాత్రి 11.30 గంటలకు 0.5 టీఎంసీల వరద నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఎస్సారెస్పీకి చేరుకుంటుందన్నారు. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందన్నారు.
Advertisement
Advertisement