
కిక్కే.. కిక్కు!
► కర్నూలు గోదాములో ‘వంద కోట్ల’ మద్యం స్టాక్
► రహదారుల పక్కన ఉన్న 167 దుకాణాలు, 17 బార్లు రద్దు
► జిల్లా వ్యాప్తంగా తెరుచుకున్న 40 దుకాణాలు, రెండు బార్లు
► మొదటి రోజు రూ.1.50 కోట్ల మద్యం కొనుగోలు
► లైసెన్సుల జారీకి అర్ధరాత్రి వరకు కొనసాగిన కసరత్తు
► దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే అనుమతి
కర్నూలు: మద్యాన్ని భారీగా విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కల్లూరు శివారు పందిపాడు సమీపంలోని హంద్రీనది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపోలో దాదాపు వంద కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నిల్వ చేసింది. నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు ఆదివారం మొదటి రోజు రూ.1.50 కోట్ల విలువ చేసే 3500 బాక్సుల మద్యం, 2200 కేసుల బీర్లను కొనుగోలు చేసి దుకాణాలకుతరలించి అమ్మకాలు ప్రారంభించారు.
204 మద్యం దుకాణాలకు ఈ ఏడాది మార్చిలో లాటరీ విధానం ద్వారా లైసెన్సీలను ఖరారు చేయగా, బార్ల పాలసీలో భాగంగా ఐదేళ్ల కాల పరిమితితో పాతవి 37, తాజాగా 10 బార్లను వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు ఖరారు చేశారు. ఆదివారం నంద్యాల ప్రాంతానికి చెందిన రెండు బార్లకు అనుమతి పత్రాలు జారీ కావడంతో అవసరమైన మద్యాన్ని డిపో నుంచి వారు తరలించారు.
బారులు తీరిన మందు బాబులు...
కొంతమంది మాత్రమే దుకాణాలు తెరవడంతో మందు బాబులు వాటి ముందు బారులు తీరారు. రెండు రోజులుగా జిల్లాలో మద్యం సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులోని వక్కెర వాగు పక్కనున్న జీవీఆర్ దుకాణంలో గంట వ్యవధిలో రూ.2.50 లక్షల మద్యం అమ్ముడపోయింది. డిపో నుంచి తీసుకొచ్చిన సరుకును దుకాణం వద్ద దింపుతుండగానే మద్యం బాబులు బారుతీరి కొనుగోలు చేశారు. కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కేవలం 10 దుకాణాలు మాత్రమే తెరుచుకోవడంతో అన్ని చోట్ల కూడా కొనుగోలు కోసం మందు బాబులు క్యూకట్టారు.
కోర్టు తీర్పుకోసం ఎదురుచూపు..
నగర, పట్టణాల్లో జాతీయ రహదారులను మేజర్ డిస్ట్రిక్ రోడ్స్ (ఎండీఆర్)గా మార్పు చేయాలని కోరుతూ కర్నూలు పట్టణానికి చెందిన కొందరు వ్యాపారులు కోర్టుకెళ్లారు. హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారి ఏర్పాటుకు ముందు కర్నూలు మున్సిపల్ కార్యాలయం, ఐదురోడ్ల కూడలి, వయా రాజ్‌విహార్ మీదుగా చిత్తూరు–కర్నూలు రోడ్డు ఉండేది. ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికే ఆ రోడ్డు జాతీయ రహదారిగా కొనసాగుతుండటంతో నగరంలోని 80 శాతం దుకాణాలు, బార్లు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ రోడ్డును మేజర్ డిస్ట్రిక్ రోడ్స్‌గా మార్పు చేయాలని కోరుతూ కేఈ జగదీష్‌గౌడ్ అనే వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు.
ఈ నెల 6వ తేదీన తీర్పు వెలువడనుంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో బార్లు కొనసాగించవచ్చన్న ఆశతో వ్యాపారులు ఉన్నారు. కర్నూలు ఎక్సైజ్ జిల్లా పరిధిలో 17 బార్లు, నంద్యాల ఎక్సైజ్‌పరిధిలో రెండు బార్లు రోడ్‌సైడు ఉన్నాయి. చివరగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అటు వ్యాపారులు, ఇటు ఎక్సైజ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం లేని దుకాణాలకు మాత్రం లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
క్యూకట్టిన లారీలు...
ఐఎంఎల్ డిపోలో భారీ మొత్తంలో స్టాక్ నిల్వ ఉండటంతో ఆదివారం వచ్చిన సరుకును దింపుకోవడానికి ఇబ్బందిగా మారింది. విజయవాడ, తిరుపతి, సింగరాయికొండతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 27 లారీలు మద్యంతో తరలివచ్చాయి. వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి లారీలతో అక్కడికి తరలిరావడంతో డిపో కిటకిటలాడుతోంది. డిపోలో ఉన్న మద్యాన్ని వ్యాపారులకు కేటాయించిన తర్వాతనే లారీల్లో ఉన్న సరుకును గోదాములోకి అనుమతించారు.
స్థానచలనం..
జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 17 బార్లకు స్థాన చలనం కలగనుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి నిబంధనలు పాటించని షాపులు, బార్లు కనిపిస్తే సీజ్ చేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు వ్యాపారుల నుంచి వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటేనే ఎక్సైజ్ అధికారులు లైసెన్సు జారీ చేస్తున్నారు. రహదారులకు 500 మీటర్ల అవతల మాత్రమే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శనివారం నుంచే అమలులోకి వచ్చింది. దీంతో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలో 204 దుకాణాలకు 40 మంది లైసెన్సీలు మాత్రమే అనుమతి పత్రాలను తీసుకెళ్లారు. ఇంకా 164 దుకాణాలకు అనుమతి పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. నంద్యాల ప్రాంతంలో రెండు బార్లకు మాత్రం అనుమతి పత్రాలను ఎక్సైజ్ అధికారులు మంజూరు చేశారు.