108 కష్టాలు
జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల అత్యవసర సేవలు 2005లో ప్రారంభమయ్యాయి. మొదట నాలుగు వాహనాలు(కర్నూలు, ఆదోని, నంద్యాల, శ్రీశైలం).. 2006లో మరో 28 వాహనాలతో ఈ సేవలను విస్తరించారు.
అపర సంజీవనికి సుస్తీ
– శిథిలమయిన వాహనాలు
– అరిగిన టైర్లు, తుప్పుపట్టిన పరికరాలు
– ఓపిక లేన్నట్లు మొరాయింపు
– కొత్త వాహనాల మంజూరులో ప్రభుత్వ అలసత్వం
కర్నూలు(హాస్పిటల్):
జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల అత్యవసర సేవలు 2005లో ప్రారంభమయ్యాయి. మొదట నాలుగు వాహనాలు(కర్నూలు, ఆదోని, నంద్యాల, శ్రీశైలం).. 2006లో మరో 28 వాహనాలతో ఈ సేవలను విస్తరించారు. అన్ని రకాల ప్రమాదాలు, గర్భిణిలను ఆసుపత్రికి తీసుకెళ్లడం, గుండెపోటు, మూర్చవ్యాధి, ఇతర అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో రోగిని ఆసుపత్రికి తరలించడం వీటి విధి. ఘటనా స్థలం నుంచి ఒక్క ఫోన్ చేస్తే చాలు 15 నిమిషాల్లో చేరుకుని ప్రాణం పోస్తున్నాయి. అప్పట్లో 108 అంబులెన్స్ సేవలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయి. జాతీయ స్థాయిలో ఉత్తమ సేవలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది.
ముక్కుతూ.. మూలుగుతూ..
జిల్లాలో మొత్తం 54 మండలాలు ఉండగా.. 32 అంబులెన్స్‌లను మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం 31 వాహనాలు సేవలందిస్తున్నా.. ఎప్పుడు, ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. వీటి పనితీరు తెలిసిన డ్రై వర్లు వాహనం కండిషన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ రోగులకు సేవలందిస్తున్నారు. ప్రతి 3లక్షల కిలోమీటర్లకు వాహనాన్ని మార్చాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఉన్న అన్ని వాహనాలు 4లక్షల కి.మీ.లకు పైగా తిరిగాయి. ప్రతిరోజూ ఏదో ఒక వాహనం వర్క్‌షాప్‌నకు వెళ్లి వస్తోంది. ప్రతి నెలా వాహనాల మరమ్మతుకే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. వాహనంలోని అన్ని పార్ట్‌లూ దాదాపు ఊగిపోతూ, ఊడిపోతూ కనిపిస్తుండటంతో.. వీటిలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ప్రధానంగా ఆదోని, కోడుమూరు, దేవనకొండ, పత్తికొండ, నంద్యాల, పాణ్యం, బనగానపల్లి, బేతంచర్ల తదితర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ దారుల్లో ఎక్కడైనా వాహనం ఆగిపోతే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీనికి తోడు పదేళ్లయినా వాహనాల సంఖ్యను పెంచకపోవడం గమనార్హం.
దుర్గంధమయంగా జిల్లా కార్యాలయం
108 అంబులెన్స్ నిర్వహణను ఓ కార్పొరేట్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. అయితే దీని జిల్లా కార్యాలయం దుర్గంధభరితంగా మారింది. జిల్లా కేంద్రంలోని సి.క్యాంపు సెంటర్ సమీపంలో ప్రభుత్వ క్వార్టర్‌లో ఈ కార్యాలయాన్ని 2006లో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోకపోవడం.. ప్రహరీ గోడ కూడా లేకపోవడంతో కార్యాలయం పందులకు నిలయంగా మారింది. చుట్టుపక్క ప్రాంతాల వారు సైతం ఇక్కడికే వచ్చి మూత్రవిసర్జన చేస్తున్నారు. విషయాన్ని ఆర్‌అండ్‌బీ అధికారుల దష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని తెలుస్తోంది.
కొత్త వాహనాలకు ప్రతిపాదనలు
ప్రస్తుతం జిల్లాలోని వాహనాల కాలపరిమితి ముగిసింది. వీటి స్థానంలో కొత్త వాహనాలు పంపాలని ప్రతిపాదనలు చేశాం. అదేవిధంగా ఐదు అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్(ఏఎల్‌ఎస్) వాహనాలు కూడా కావాలని కోరాం. ఈ వాహనాలు వస్తే గుండెపోటు వచ్చిన రోగులకు, అత్యవసర వైద్యం కావాల్సిన రోగులకు వాహనంలోనే వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ సౌకర్యంతో ప్రాథమిక చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
– ఇక్బాల్ హుసేన్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్