నారాయణఖేడ్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 12 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
నారాయణఖేడ్(మెదక్ జిల్లా): నారాయణఖేడ్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 12 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్,కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల తరపున రెండు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. 28న స్ర్కూటిని, 30న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది.
ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో నారాయణఖేడ్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఈ నెల 20న నోటిఫికేషన్ జారీచేసింది. అదే రోజు నుంచి 27వ తేదీ మూడు గంటల వరకు గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు బుధవారం టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
టీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన భూపాల్ రెడ్డి మళ్ళీ ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి దివంగత ఎమ్మెల్యే కుమారుడు, ప్రస్తుత నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి నామినేషన్ వేశారు. ఇక టీడీపీ నుంచి విజయపాల్ రెడ్డి పోటీలో దిగారు. టీడీపీ, టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి స్వయానా సోదరులు. ఇద్దరు గత రెండు పర్యాయాలుగా ఎన్నికల బరిలో నిలివడం గమనార్హం. మరో తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఫిబ్రవరి 11న ప్రచారానికి గడవు ముగియనుంది. 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.