- డివిజన్ల వారీగా రోజులు కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ 13 టీములను నియమించారు. ఒక్కో టీములో ఉద్యాన అధికారి, మార్కెటింగ్ శాఖ సూపర్‌వైజర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. మార్కెట్‌లో 13 షెడ్‌లు ఉన్నాయి. ఒక్కో షెడ్‌కు ఒక టీమును ఏర్పాటు చేశారు. ఈ టీములు రైతులు మార్కెట్‌కు తెచ్చిన ఉల్లి నాణ్యతను పరిశీలించి గ్రేడ్‌లు ఇస్తుంది. ఇందుకు అనుగుణంగా ధరలు రావాల్సి ఉంది. గ్రేడ్‌కు తగిన ధర లభించకపోతే వ్యాపారులపై చర్యలు తీసుకుంటారు. ఉల్లికి ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు. కర్నూలు రెవెన్యూ డివిజన్ రైతులు సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే మార్కెట్‌కు ఉల్లి తెచ్చుకొని విక్రయించుకోవాల్సిఉంది. ఆదోని రెవెన్యూ డివిజన్ రైతులు మంగళ, గురువారాల్లో, నంద్యాల రెవెన్యూ డివిజన్ రైతులు శనివారం మాత్రమే ఉల్లిని తెచ్చు కోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రైతులకు సూచించారు. మార్కెట్‌లోకి ఉల్లిని ముందు రోజు సాయంత్రం నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతుందని వివరించారు. రైతులు మార్కెట్‌కు వచ్చేటపుడు ఆన్‌లైన్ అడంగల్, ఆధార్ కార్డు , బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ తీసుకరావాలని సూచించారు. ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తారు. ఇందులో రైతుల భూముల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో ఎన్ని ఎకరాల్లో ఉల్లి సాగు చేసింది ఉంటుంది. రైతులు ఈ కార్డుపై సంబంధిత వీఆర్‌ఓ, తహసీల్దారు సంతకాలు చేయించి మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించాలి. ఆ తర్వాతనే రైతుల బ్యాంకు ఖాతాకు మద్దతు మొత్తాన్ని జమ చేస్తారు. రూ.50 నుంచి రూ.300 వరకు ఉల్లికి ధర లభిస్తే ఆ రైతులకు ప్రభుత్వం రూ.300 మద్దతు చెల్లిస్తుంది. రూ.400 ధర లభిస్తే రూ.200, రూ.500 ధర లభిస్తే రూ.100 ప్రకారం మద్దతును చెల్లిస్తారు.గరిష్టంగా క్వింటాలుకు రూ.300 మద్దతు కి ంద చెల్లిస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరీ తెలిపారు.