
ఆ కేసులో 14 మంది ఉద్యోగులకు జైలు శిక్ష
కాకినాడ నగరపాలక సంస్థలో బిల్డింగ్ ప్లాన్‌లకు నకిలీ చలానాలు చెల్లించిన కేసులో 14 మంది ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తూ కాకినాడ రెండో అదనపు సివిల్ జడ్జి, సీబీసీఐడీ మేజిస్ట్రేట్ కె.శివశంకర్ మంగళవారం తీర్పు చెప్పారు.
కాకినాడ లీగల్(తూర్పు గోదావరి జిల్లా): కాకినాడ నగరపాలక సంస్థలో బిల్డింగ్ ప్లాన్‌లకు నకిలీ చలానాలు చెల్లించిన కేసులో 14 మంది ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తూ కాకినాడ రెండో అదనపు సివిల్ జడ్జి, సీబీసీఐడీ మేజిస్ట్రేట్ కె.శివశంకర్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 1999-2005 మధ్యకాలంలో ఉద్యోగులు నకిలీ చలానాలు తయారు చేసి, బిల్డింగ్ ప్లాన్‌లకు అనుమతులు ఇచ్చి, భవన యజమానుల నుంచి యథాతథంగా సొమ్ములు వసూలు చేశారు. కార్పొరేషన్ ఆడిట్ విభాగం ఆడిట్ చేసిన సమయంలో ఈ కుంభకోణం బయటపడింది.
సుమారు 250 చలానాలకు రూ.26,68,356 సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. దీనిపై అప్పటి కమిషనర్ కె.వెంకటేశ్వర్లు 2006లో నాటి కలెక్టర్ జవహర్‌రెడ్డికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అప్పటి కలెక్టర్ సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ అనంతరం 14 మంది ఉద్యోగులపై సీబీసీఐడీ కేసులు నమోదు చేసింది. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ముగ్గురు సిబ్బందికి రెండేళ్ల జైలు, జరిమానా విధించారు. మిగిలిన 11 మందికి ఆరు నెలల జైలు, జరిమానా విధించారు. మొత్తం 14 మందికి వివిధ సెక్షన్ల కింద రూ.94 వేల జరిమానా విధించారు. ఏపీపీ ఎంవీఎస్‌ఎస్ ప్రకాశరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు.