విజయవాడ/తుని: తునిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే విజయవాడలో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. మంగళగిరి నుంచి అదనపు బలగాలు చేరుకున్నట్టు సమాచారం. అయితే కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ.. ఉద్యమరూపం దాల్చిన సంగతి తెలిసిందే.
ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభమైన కాసేపటికి కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. సభ వేదికపై నుంచి దిగిన ముద్రగడ పద్మనాభం సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు. అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపుగర్జన కార్యకర్తలు ఆయనను అనుసరించి రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించారు. దీంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాపుగర్జన కార్యకర్తలు తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఆందోళన చేస్తుండగా, అదే సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ఇంజిన్ ధ్వంసమైంది. రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పోరు ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇళ్లలో ఉన్నవారంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపుగర్జనకు తరలివచ్చిన లక్షలాదిమంది ఒక్కసారిగా రైలు పట్టాలు, రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తుని ఘటన: విజయవాడలో 144 సెక్షన్
Published Sun, Jan 31 2016 10:08 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement