రూ. 150 కోట్లతో బంగారు ఆలయం
బాలకృష్ణుడికి రూ.150 కోట్లతో బంగారు ఆలయాన్ని నిర్మించనున్నారు. గుంటూరు జిల్లా కొండవీడు ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించాలని ఇస్కాన్ నిర్ణయించింది. దసరా రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఇస్కాన్ తెలిపింది. విజయదశమినాడు స్వర్ణమందిరం ఏర్పాటు పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నట్లు సమాచారం. మొత్తం 150 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆలయ ప్రాంతానికి ఇస్కాన్ కొండవీడుగా నామకరణం చేసింది. చారిత్రక వెన్నముద్దల వేణుగోపాస్వామికి ఈ ప్రతిష్టాత్మక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటలోని వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం ప్రపంచంలోనే అతి అరుదైనదని వేదపండితులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇస్కాన్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నారు.
స్వర్ణమందిరం చుట్టూ మహాభారత, రామాయణాలపై పురాణ గాథలను వివరిస్తూ వినూత్నరీతిలో మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేలా ఉంటాయి. ఇంకా వేద పాఠశాల, అండర్ వాటర్ మెడిటేషన్ హాలు, ప్రాచీన శాస్త్రాలను సైన్స్ పరంగా చూపే థియేటర్లు, శ్రీకృష్ణుని లీలలను భావితరాలకు తెలిపే ధీం పార్కులు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్లతో అంచనాలు రూపొందించామని ఇస్కాన్ దక్షిణ భారత ఛైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ వివరించారు.