కరువు మండలాల్లో 150 పని దినాలు
కరువు మండలాల్లో 150 పని దినాలు
Published Thu, Nov 3 2016 10:28 PM | Last Updated on Sat, Sep 29 2018 6:11 PM
– డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి
కర్నూలు(అర్బన్): జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన 36 కరువు మండలాల్లో ఉపాధి కూలీ పని దినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచినట్లు డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి తెలిపారు. గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ పని దినాలను పెంచుతూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలు(లేఖ నెంబర్ 2133) జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కరువు మండలాల్లో ఉపాధి కూలీలు 150 రోజుల వరకు ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. కరువు మండలాలుగా ప్రకటించిన గ్రామాల్లో ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలకు అదనంగా 50 రోజుల పనులు చేసే అవకాశం వచ్చిందన్నారు.ఽ
జిల్లాలో ప్రకటించిన కరువు మండలాలు
పెద్దకడుబూరు, హొళగుంద, ఆలూరు, శిరువెళ్ల, సంజామల, హాలహర్వి, మంత్రాలయం, నందవరం, సి.బెళగల్, గూడూరు, కొత్తపల్లి, ఓర్వకల్లు, కల్లూరు, కోడుమూరు, క్రిష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఉయ్యాలవాడ, గోస్పాడు, కోయిలకుంట్ల, బనగానపల్లె, కొలిమిగుండ్ల, అవుకు, ప్యాపిలి, డోన్, తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, చిప్పగిరి, ఆస్పరి, ఆదోని.
మార్చి నాటికి 70వేల ఫాంఫాండ్స్ పూర్తి
జిల్లాలో 70వేల ఫాంపాండ్స్‌ను 2017 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు పీడీ తెలిపారు. ఇప్పటి వరకు 34వేల ఫాంఫాండ్స్ పనులు చేపట్టామని, ఇందులో దాదాపు పూర్తయ్యాయని.. మిగిలిన 36వేలను నెలకు 6 వేల ప్రకారం మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఒక్కో ఫాంఫాండ్ నిర్మాణానికి రూ.30 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు.
6,500 వర్మీ కంపోస్టు యూనిట్ల పూర్తి
జిల్లాలో వర్మీకంపోస్టు యూనిట్లను కూడా మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. మొత్తం 15వేల యూనిట్లలో ఇప్పటి వరకు 6,500 పూర్తి చేశామమన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని గ్రామ ఐక్య సంఘాల ద్వారా కూడా వర్మీ కంపోస్టు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పుల్లారెడ్డి వివరించారు.
Advertisement