19 మంది సీడీపీవోలకు శ్రీముఖాలు | 19 CDPOs got charge memos | Sakshi
Sakshi News home page

19 మంది సీడీపీవోలకు శ్రీముఖాలు

Published Wed, Nov 2 2016 8:56 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

19 మంది సీడీపీవోలకు శ్రీముఖాలు - Sakshi

19 మంది సీడీపీవోలకు శ్రీముఖాలు

* నలుగురు సీడీపీవోలపై వేటుకు రంగం సిద్ధం
* పీడీ నిర్మలపై చర్యలపై వీడని ఉత్కంఠ
 
గుంటూరు వెస్ట్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో పామాయిల్, కోడిగుడ్లు, పప్పు దినుసుల సరఫరాలో జరిగిన అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అధికారులు (సీడీపీవో) 19 మందికి బుధవారం రాత్రి చార్జి మెమోలు జారీ అయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ జి.జయలక్ష్మి జోక్యం మేరకు రాష్ట్ర కమిషనర్‌ చక్రవర్తి చార్జి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులపై వేటుపడింది. పామాయిలు సరఫరాలో నిర్ణీత ధరకన్నా అదనంగా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించిన వ్యవహారంలో రూ.50 లక్షల వరకూ అక్రమాలు జరిగాయి. అందులో రూ.25 లక్షలు రికవరీ చేసినట్లు చక్రవర్తి వెల్లడించారు. ఈక్రమంలో స్కామ్‌లో భాగస్వామ్యం ఉండి, తమకు చార్జి మెమోలు అందుతాయనే ఆందోళనలో ఉన్న కొంతమంది సీడీపీవోలు అధికార పార్టీ మంత్రులు, జిల్లాలో కీలకపాత్ర వహిస్తున్న ఎమ్మెల్యేలు, పెద్దలను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.
 
నలుగురు సీడీపీవోలపై చర్యలకు రంగం సిద్ధం..
రెండేళ్ల క్రితం అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా అయిన పామాయిల్‌ ధరల చెల్లింపులో అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో ఆ శాఖ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బీ.వసంతబాల, సూపరింటెండెంట్‌ ప్రసాదలింగం, సీనియర్‌ అసిస్టెంట్‌ దస్తగిరిలపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కామ్‌లో సీడీపీవోల పాత్రపై దృష్టిసారించిన ఉన్నతాధికారులు 19 మందికి చార్జి మెమోలు జారీ చేశారు. అదేవిధంగా కోడిగుడ్ల సరఫరాలో భారీగా అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లాలోని నలుగురు సీడీపీవోలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకటి రెండురోజుల్లో వారిపై సస్పెన్షన్‌ వేటు వేసేవిధంగా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ మల్లెల జెస్సీ నిర్మలపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆమెపై బదిలీ వేటు వేస్తారా ? లేక సస్పెన్షన్‌ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement