charge memos
-
పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్‌కు చేదు అనుభవం
ఒంగోలు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. సమస్యలు విన్నవించేందుకు పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుడిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడి, అవమానించిన నేరానికి రైటర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు సీఐ సహా మరో ఆరుగురికి జిల్లా ఎస్పీ ఛార్జి మెమోలు జారీ చేశారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వస్తున్న సామాన్య ప్రజలపై పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలని భావించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఓ ట్రైనీ ఐపీఎస్‌ను ఫిర్యాదిదారుగా ఠాణాకు పంపించారు. ట్రైనీ ఐపీఎస్ అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎస్పీకి రాతపూర్వకంగా తెలియజేయడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలకం రేపింది. ఏం జరిగిందంటే.. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ శుక్రవారం ఉదయం సామాన్యులా ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. సివిల్ దుస్తులలో వెళ్ళిన అతనిని స్టేషన్ సిబ్బంది గుర్తించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కొని పారిపోయారంటూ జగదీష్ ఇచ్చిన ఫిర్యాదును రిసెప్షన్లో ఉన్న సిబ్బంది తీసుకోలేదు. దీంతో ఆయన అక్కడ ఉన్న కానిస్టేబుళ్లతో మాట్లాడారు. వారి నుంచి స్పందన లభించలేదు. సీఐగారు వచ్చిన తరువాత రమ్మంటూ పంపించేశారు. దీంతో వెనుదిరిగి వెళ్లిన ఆయన మళ్లీ సాయంత్రం మరలా స్టేషన్‌కు వెళ్లాడు. అయినా నో రెస్పాన్స్. చివరకు ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ ఆయనను రైటర్ వద్దకు పంపారు. రైటర్‌ను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరగా సీఐ వచ్చిన తరువాత విచారించి, చర్యలు చేపడతామన్నారు. తాను అర్జంటుగా గన్నవరం వెళ్లాల్సి ఉందని, కనీసం ఫిర్యాదు చేసినట్లు రశీదు అయినా ఇవ్వాలని కోరారు. దానికి కూడా స్పందించకుండా ఐఎంఈఐ నంబర్లు, ఫోన్ తనవే అన్నట్లుగా రశీదులు తీసుకురావాలంటూ మరో అధికారి సూచించారు. చివరకు వారంతా కలిసి ఫిర్యాదిని ఎస్సై సాంబశివయ్య వద్దకు పంపారు. అక్కడ కూడా ఎటువంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఫిర్యాది తక్షణమే ఎఫ్ఐఆర్ కాపీ కావాలని, కనీసం రశీదు అయినా ఇవ్వాలంటూ గట్టిగా అడగడంతో స్టేషన్ సిబ్బంది ఆయన పట్ల అసభ్యంగా మాట్లాడారు. దీంతో తిరుగుముఖం పట్టిన జగదీష్ తాను తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళితే జరిగిన అవమానాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రైటర్ సస్పెన్షన్.. సీఐ సహా ఐదుగురికి ఛార్జి మెమోలు: తాలూకా పోలీసుస్టేషన్లో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు కావడంతో ఎస్పీ తక్షణమే క్రమశిక్షణా చర్యలకు పూనుకున్నారు. సభ్యత, సంస్కారంలేని మాటలతో ఫిర్యాదిని అవమానపరచడం, దురుసుగా మాట్లాడడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె.సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ పి.ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎంవీ రాజేష్, మహిళా కానిస్టేబుల్ ఎన్.రమ్యకిరణ్మయిలకు పనిష్మెంట్ కింద ఛార్జి మెమోలు జారీ చేశారు. ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదిదారులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవమానకరంగా మాట్లాడినట్లు తమ దృష్టికి వచ్చినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
స్వాహాకు మూల్యం !
సాక్షి, నల్లగొండ:మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే పావలా వడ్డీని చౌటుప్పల్ మండలంలో స్వాహా చేసిన పది మంది ఐకేపీ ఉద్యోగులకు చార్జ్‌మెమోలు జారీ అయ్యాయి. పావలా వడ్డీ ‘స్వాహా’ శీర్షికన ఈ ఏడాది సెప్టెంబర్ 20న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందిం చారు. విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత సదరు సిబ్బందికి తాఖీదులు ఇచ్చారు. అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’ కథనంపై నెలన్నర రోజులుగా, జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన ఐకేపీ ఆడిటర్లతో విచారణ చేయించారు. వీరు చౌటుప్పల్ లోనిఐకేపీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతో పాటు, గ్రామగ్రామాన తిరిగి, మహిళా సంఘాల సభ్యులను కలిసి విచారించారు. సంఘాల రికార్డులను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వాటి ఆధారంగా చౌటుప్పల్ మండలంలో ఏపీఎంలుగా, సీసీలుగా పనిచేసిన 8మంది ఉద్యోగులతో పాటు, ఇద్దరు వీబీకేలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య పేరిట చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఇందులో వి.కృష్ణయ్య (ఏపీఎం,నార్కట్‌పల్లి), సుధారాణి (క్లస్టర్ ఏపీఎం, వలిగొండ), శ్రీనివాస్ (క్లస్టర్ ఏపీఎం, భువనగిరి), లక్ష్మీ (ఏపీఎం, మేళ్లచె ర్వు), వెంకటేశం (ఏపీఎం, చిట్యాల), నీరజ (ఏపీఎం,చౌటుప్పల్), కె.సత్తిరెడ్డి (ఆడిటర్, చౌటుప్పల్), కె.అలివేలు (సీసీ, చౌటుప్పల్)లు ఉన్నారు. ఇంటెలిజెన్సు విచారణ ఈ అవినీతి వ్యవహారంపై ‘ సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇంటెలిజెన్స్ ఎస్పీ స్పందించారు. పావలా వడ్డీ స్వాహాపై విచారణ జరిపించారు. దాదాపు రూ.39 లక్షలు పక్కదారి పట్టినట్టు ఇంటెలిజెన్సు విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. సంజాయిషీ తర్వాత, మరో వారం రోజుల్లో సస్పెన్షన్ల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన సిబ్బందిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఈ మేరకు చార్జ్‌మెమోలు జారీ చేశామని డీఆర్డీఏ పీడీ ఆర్.అంజయ్య ‘సాక్షి’కి తెలిపారు. అసలేం జరిగిందంటే.... చౌటుప్పల్ మండలంలోని మహిళా సంఘాలకు 2008కు ముందు మూడేళ్ల పావలా వడ్డీ రాలేదు. 2009లో ఒకేసారి రూ.84లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ కొద్ది రోజులకే 2009 ఏడాదికి సంబంధించిన పావలా వడ్డీ మంజూరైంది. ఈ సమయంలో అక్కడ పనిచేసిన ఏపీఎంలు, సీసీలు, కొందరు మహిళా సంఘాల లీడర్లతో కుమ్మక్కై, మొదట వచ్చిన రూ.84 లక్షల పావలా వడ్డీలో, సగానికి పైగా స్వాహా చేశారు. నిరక్షరాస్యులైన సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి సంఘాల ఖాతాల్లో వేశారు. డబ్బులు పొరపాటున మీ ఖాతాలో పడ్డాయి, వేరే సంఘం వారివని చెప్పి, వారితో సంతకాలు చేయించుకుని, వారితోనే బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేయించి తీసుకున్నారు. ఇలా ఎవరికీ వారు స్వాహా పర్వానికి తెరలేపి సుమారు రూ.40 లక్షలను స్వాహా చేశారనేది విశ్వసనీయ సమాచారం. అయితే, బ్యాంకుల నుంచి వడ్డీని డ్రా చేసినట్టు రికార్డులు ఉన్నప్పటికీ, మహిళా సంఘాల రికార్డుల్లో ఎక్కడా రాయలేదు. యూసీలు లేవు. దీంతో సదరు ఉద్యోగులకు వారు పనిచేసిన కాలంలో, రికార్డులు లేని సొమ్ము గురించి సంజాయిషీ ఇవ్వాలని కోరారు. -
19 మంది సీడీపీవోలకు శ్రీముఖాలు
* నలుగురు సీడీపీవోలపై వేటుకు రంగం సిద్ధం * పీడీ నిర్మలపై చర్యలపై వీడని ఉత్కంఠ గుంటూరు వెస్ట్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో పామాయిల్, కోడిగుడ్లు, పప్పు దినుసుల సరఫరాలో జరిగిన అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారులు (సీడీపీవో) 19 మందికి బుధవారం రాత్రి చార్జి మెమోలు జారీ అయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ జి.జయలక్ష్మి జోక్యం మేరకు రాష్ట్ర కమిషనర్ చక్రవర్తి చార్జి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులపై వేటుపడింది. పామాయిలు సరఫరాలో నిర్ణీత ధరకన్నా అదనంగా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించిన వ్యవహారంలో రూ.50 లక్షల వరకూ అక్రమాలు జరిగాయి. అందులో రూ.25 లక్షలు రికవరీ చేసినట్లు చక్రవర్తి వెల్లడించారు. ఈక్రమంలో స్కామ్‌లో భాగస్వామ్యం ఉండి, తమకు చార్జి మెమోలు అందుతాయనే ఆందోళనలో ఉన్న కొంతమంది సీడీపీవోలు అధికార పార్టీ మంత్రులు, జిల్లాలో కీలకపాత్ర వహిస్తున్న ఎమ్మెల్యేలు, పెద్దలను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నలుగురు సీడీపీవోలపై చర్యలకు రంగం సిద్ధం.. రెండేళ్ల క్రితం అంగన్వాడీ సెంటర్లకు సరఫరా అయిన పామాయిల్ ధరల చెల్లింపులో అవినీతి ఆరోపణలు రుజువుకావడంతో ఆ శాఖ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ బీ.వసంతబాల, సూపరింటెండెంట్ ప్రసాదలింగం, సీనియర్ అసిస్టెంట్ దస్తగిరిలపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కామ్‌లో సీడీపీవోల పాత్రపై దృష్టిసారించిన ఉన్నతాధికారులు 19 మందికి చార్జి మెమోలు జారీ చేశారు. అదేవిధంగా కోడిగుడ్ల సరఫరాలో భారీగా అవినీతి జరిగినట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరించుకున్నారు. ఈ వ్యవహారంలో జిల్లాలోని నలుగురు సీడీపీవోలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకటి రెండురోజుల్లో వారిపై సస్పెన్షన్ వేటు వేసేవిధంగా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ మల్లెల జెస్సీ నిర్మలపై ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆమెపై బదిలీ వేటు వేస్తారా ? లేక సస్పెన్షన్ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది -
ఆయనంటే హడల్
- ఆస్తిపాస్తుల కిరికిరి - ఎస్సైలకు చార్జిమెమోలు - వివరణ ఇచ్చినా బేఖాతరు - రాష్ట్రస్థాయికి పేచీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్:‘కనీసం సమాచారం ఇవ్వకుండా విలువైన అస్తులు కొనుగోలు చేశారు. ఎందుకు మీపై చట్టప్రకారం చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ... ’ ఇటీవల జిల్లాలో దాదాపు 43 మంది ఎస్సైలకు డీఐజీ కార్యాలయం నుంచి చార్జీమెమోలు జారీ అయ్యాయి. వీరిలో చాలామంది రెండేళ్ల కిందటే పోస్టింగ్‌లు పొందారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కొత్తలో అవగాహనలోపంతో కొందరు ఎస్సైలు తమ ఆస్తులు ఉన్నవి, లేనివి చూపించారు. గతేడాది ఆరంభంలో డీఐజీ కార్యాలయం నుంచి వీరందరికీ ఆస్తులపై వివరణ ఇవ్వాలని మెమోలు జారీ అయ్యాయి. ఈ మధ్య వ్యవధిలో కొందరు ఎస్సైలు పెళ్లి చేసుకున్నారు. కట్నకానుకలు, డబ్బులు, బంగారం, వాహనాలు ఇతర విలువైన అస్తులు అదనంగా వచ్చిచేరాయి. ఆస్తుల వివరాల్లో తప్పులుంటే మన్నించాలని, ముందుగా అనుమతి తీసుకోవాలని తమకు తెలియదని ఎస్సైలు వివరణ ఇచ్చుకున్నారు. కొన్ని జిల్లాల్లో తమ ఉద్యోగులు నిజాయితీగా సమాధానం ఇచ్చారని భావించి అక్కడి అధికారులు మానవతా దృక్పథంతో మెమోలు పక్కన బెట్టారు. కానీ.. మన జిల్లాలో ఎస్సైల వేడుకోలు బుట్ట దాఖలైంది. గతంలో చేసిన పొరపాటు మళ్లీ చేయబోమని, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినందున దయతో మన్నించాలని ప్రొబేషనరీ ఎస్సైలు సంజాయిషీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మీపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ 15 రోజుల కిందట చార్జిమెమోలు జారీ అయ్యాయి. దీంతో ఎస్సైలు హడలెత్తిపోయారు. ప్రొబేషనరీ సమయం కావటంతో... ఇప్పుడు చార్జిమోమోలు ఇస్తే రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఏం కిరికిరి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అదే అదనుగా సదరు ఉన్నతాధికారి కార్యాలయంలో చక్రం తిప్పే ఉద్యోగి రంగప్రవేశం చేసి... ఎంతోకొంత సమర్పిస్తే సమస్యను పరిష్కరిస్తానంటూ అసలు కబురు అందరికీ జారవేశారు. దీంతో మెమోల జారీ వెనుక లోగుట్టు బయట పడినట్లయింది. ఎలాగైతేనేం.. అడిగినంత ఇచ్చి చేతులు దులుపుకోవటం నయమని కొందరు, అంత భారీ మొత్తం సమర్పించుకోలేమని కొందరు.. ఈ రాయ‘బేరం’పై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఉద్యోగి చెప్పిన ‘ఫిగర్' విన్నాక కొందరు ఎస్సైలు బిత్తరపోయారు. దీంతో ఆస్తుల మెమోల వ్యవహారానికి తాత్కాలికంగా పీటముడి పడింది. లూప్లైన్లో పని చేస్తున్న ఎస్సైలు అంత ‘భారం' భరించలేమంటూ చేతులెత్తేశారు. చార్జిమెమోల సాకుతో తెరవెనుక జరుగుతున్న వసూళ్ల పర్వంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో రెండు రోజుల్లో స్వయానా సీఎం, హోంమంత్రి, డీజీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్సైల ఆస్తిపాస్తులు, అధికారి వసూళ్ల పేచీ రాష్ట్ర స్థాయికి చేరనుంది. గతంలోనూ ఇదే అధికారిపై జిల్లాలో పలు ఆరోపణలు వెల్లువెత్తటం గమనార్హం. పోస్టింగ్‌ల్లో తల దూర్చడం, పోలీస్‌స్టేషన్ తనిఖీకి వెళ్లి బేరమాడటం, మాట వినకుంటే తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేయటం, అదే కార్యాలయంలో పాతుకుపోయిన ఓ ఉద్యోగిని అడ్డుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్న ఫిర్యాదులన్నీ మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది. -
మొదటి తప్పుగా మన్నించండి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. వేతనంలో కోత, శాఖాపరమైన చర్యలు అంటే ఏమో గానీ... ప్రాసిక్యూషన్ అంటే ఉద్యోగాలకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకుని గండం నుంచి బయటపడాలని భావిస్తున్నారు. మొదటి తప్పుగా భావించి మన్నించాలని జిల్లా కలెక్టర్‌ను కోరేందుకు సిద్ధపడుతున్నారు. విధులకు హాజరైన ఉద్యోగులు మాత్రం గైర్హాజరైన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఇప్పటికీ ఇదే భావనతో ఉన్నారు. గైర్హాజరు ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా ఉంటే ఏడాదిలోపే జరగబోయే మున్సిపల్, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణపైనా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. జిలాల్లో మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,220 మంది ఉద్యోగులు గైర్హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఉపాధ్యాయులే 1,100 మంది ఉన్నారు. వీరందరికీ విద్యాశాఖ నుంచి ఇప్పటికే చార్జీ మొమోలు వెళ్లాయి. మిగిలిన ఉద్యోగులకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చార్జి మెమోలు పంపిస్తున్నారు. రెండు రోజుల వేతనం కోత అనేది జరిగిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గైర్హాజరు ఉద్యోగుల ప్రాసిక్యూషన్ జరపాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే ఉద్యోగాలకే ప్రమాదం ఏర్పడుతుందని గైర్హాజరు ఉద్యోగులు భావిస్తున్నారు. ఏలాగైనా ఈ ఒక్కసారికి చర్యలు లేకుండా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకోవాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాల జిల్లా ఐక్య కార్యాచరణ సమితి జిల్లా శాఖ శుక్రవారం సమావేశమైంది. గైర్హాజరు ఉద్యోగులపై చర్యల అంశాన్ని సానుభూతితో పునఃపరిశీలించాలని కోరింది. ఈ మేరకు స్వయంగా ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేసే యోచనలో ఉంది. మిగిలిన శాఖల ఉద్యోగులు సైతం ఇదే తరహాలో విజ్ఞప్తి చేసుకోనున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. గైర్హాజరు ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తిని ఎలక్షన్ కమిషన్‌కు నివేదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి నుంచి తుది ఆదేశాల ప్రకారం నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బంది గైర్హాజరు జిల్లా యంత్రాంగానికి ఇబ్బంది కలిగించింది. జోరువానలో జూలై 23న నిర్వహించిన తొలిదశ పోలింగ్‌లో ఎక్కువ మంది గైర్హాజరయ్యారు. ఏం చేయాలో పాలుపోని అధికారులు అప్పటికప్పుడు జిల్లా కేంద్రం నుంచి కొంతమంది ఉద్యోగులను పిలిపించుకుని ఎన్నికల విధులకు పంపారు. మొదటి దశలో గైర్హాజరైనవారి విషయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి జల్లా యంత్రాంగానికి లేకుండా పోయింది. దీంతో రెండు, మూడో దశల్లో గైర్హాజరు ఉద్యోగులు ఎక్కువ మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో గైర్హాజరైన వారిపై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 24వేల మందిని ఎన్నికల విధుల కోసం నియమించారు. వీరిలో 1,220 మంది గైర్హాజరైనట్లు తెలిసింది. వీరికి సంబంధించిన రెండు రోజుల వేతనాన్ని కోత విధించారు. శాఖాపరంగా క్రమశిక్షణ చర్యల తీసుకునేందుకు అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా గైర్హాజరు ఉద్యోగులకు చార్జీ మెమోలు వెళ్తున్నాయి. గైర్హాజరైన వారిలో 720 మంది ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని గుర్తించారు. విధుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన వీరిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఆర్డీవోలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ చర్యలపై ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.