సాక్షిప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. వేతనంలో కోత, శాఖాపరమైన చర్యలు అంటే ఏమో గానీ... ప్రాసిక్యూషన్ అంటే ఉద్యోగాలకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకుని గండం నుంచి బయటపడాలని భావిస్తున్నారు.
మొదటి తప్పుగా భావించి మన్నించాలని జిల్లా కలెక్టర్‌ను కోరేందుకు సిద్ధపడుతున్నారు. విధులకు హాజరైన ఉద్యోగులు మాత్రం గైర్హాజరైన వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఇప్పటికీ ఇదే భావనతో ఉన్నారు. గైర్హాజరు ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా ఉంటే ఏడాదిలోపే జరగబోయే మున్సిపల్, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణపైనా ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
జిలాల్లో మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,220 మంది ఉద్యోగులు గైర్హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఉపాధ్యాయులే 1,100 మంది ఉన్నారు. వీరందరికీ విద్యాశాఖ నుంచి ఇప్పటికే చార్జీ మొమోలు వెళ్లాయి. మిగిలిన ఉద్యోగులకు ఆయా శాఖల ఉన్నతాధికారులు చార్జి మెమోలు పంపిస్తున్నారు. రెండు రోజుల వేతనం కోత అనేది జరిగిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తయితే... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గైర్హాజరు ఉద్యోగుల ప్రాసిక్యూషన్ జరపాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే జరిగితే ఉద్యోగాలకే ప్రమాదం ఏర్పడుతుందని గైర్హాజరు ఉద్యోగులు భావిస్తున్నారు. ఏలాగైనా ఈ ఒక్కసారికి చర్యలు లేకుండా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసుకోవాలని నిర్ణయించారు. ఉపాధ్యాయ సంఘాల జిల్లా ఐక్య కార్యాచరణ సమితి జిల్లా శాఖ శుక్రవారం సమావేశమైంది. గైర్హాజరు ఉద్యోగులపై చర్యల అంశాన్ని సానుభూతితో పునఃపరిశీలించాలని కోరింది.
ఈ మేరకు స్వయంగా ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేసే యోచనలో ఉంది. మిగిలిన శాఖల ఉద్యోగులు సైతం ఇదే తరహాలో విజ్ఞప్తి చేసుకోనున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. గైర్హాజరు ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తిని ఎలక్షన్ కమిషన్‌కు నివేదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి నుంచి తుది ఆదేశాల ప్రకారం నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో సిబ్బంది గైర్హాజరు జిల్లా యంత్రాంగానికి ఇబ్బంది కలిగించింది. జోరువానలో జూలై 23న నిర్వహించిన తొలిదశ పోలింగ్‌లో ఎక్కువ మంది గైర్హాజరయ్యారు. ఏం చేయాలో పాలుపోని అధికారులు అప్పటికప్పుడు జిల్లా కేంద్రం నుంచి కొంతమంది ఉద్యోగులను పిలిపించుకుని ఎన్నికల విధులకు పంపారు. మొదటి దశలో గైర్హాజరైనవారి విషయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి జల్లా యంత్రాంగానికి లేకుండా పోయింది. దీంతో రెండు, మూడో దశల్లో గైర్హాజరు ఉద్యోగులు ఎక్కువ మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో గైర్హాజరైన వారిపై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
24వేల మందిని ఎన్నికల విధుల కోసం నియమించారు. వీరిలో 1,220 మంది గైర్హాజరైనట్లు తెలిసింది. వీరికి సంబంధించిన రెండు రోజుల వేతనాన్ని కోత విధించారు. శాఖాపరంగా క్రమశిక్షణ చర్యల తీసుకునేందుకు అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి అనుగుణంగా గైర్హాజరు ఉద్యోగులకు చార్జీ మెమోలు వెళ్తున్నాయి. గైర్హాజరైన వారిలో 720 మంది ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని గుర్తించారు. విధుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన వీరిపై పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఆర్డీవోలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ చర్యలపై ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
మొదటి తప్పుగా మన్నించండి
Published Sat, Aug 10 2013 4:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement