
ఒంగోలు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. సమస్యలు విన్నవించేందుకు పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారుడిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడి, అవమానించిన నేరానికి రైటర్‌ను సస్పెండ్ చేయడంతోపాటు సీఐ సహా మరో ఆరుగురికి జిల్లా ఎస్పీ ఛార్జి మెమోలు జారీ చేశారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వస్తున్న సామాన్య ప్రజలపై పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని వస్తున్న ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలని భావించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఓ ట్రైనీ ఐపీఎస్‌ను ఫిర్యాదిదారుగా ఠాణాకు పంపించారు. ట్రైనీ ఐపీఎస్ అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎస్పీకి రాతపూర్వకంగా తెలియజేయడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలకం రేపింది.
ఏం జరిగిందంటే..
జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ శుక్రవారం ఉదయం సామాన్యులా ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళ్లాడు. సివిల్ దుస్తులలో వెళ్ళిన అతనిని స్టేషన్ సిబ్బంది గుర్తించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి చేతిలో ఉన్న మొబైల్‌ను లాక్కొని పారిపోయారంటూ జగదీష్ ఇచ్చిన ఫిర్యాదును రిసెప్షన్‌లో ఉన్న సిబ్బంది తీసుకోలేదు. దీంతో ఆయన అక్కడ ఉన్న కానిస్టేబుళ్లతో మాట్లాడారు. వారి నుంచి స్పందన లభించలేదు. సీఐగారు వచ్చిన తరువాత రమ్మంటూ పంపించేశారు. దీంతో వెనుదిరిగి వెళ్లిన ఆయన మళ్లీ సాయంత్రం మరలా స్టేషన్‌కు వెళ్లాడు. అయినా నో రెస్పాన్స్. చివరకు ఫిర్యాదు తీసుకున్న కానిస్టేబుల్ ఆయనను రైటర్ వద్దకు పంపారు. రైటర్‌ను ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని కోరగా సీఐ వచ్చిన తరువాత విచారించి, చర్యలు చేపడతామన్నారు. తాను అర్జంటుగా గన్నవరం వెళ్లాల్సి ఉందని, కనీసం ఫిర్యాదు చేసినట్లు రశీదు అయినా ఇవ్వాలని కోరారు.
దానికి కూడా స్పందించకుండా ఐఎంఈఐ నంబర్లు, ఫోన్ తనవే అన్నట్లుగా రశీదులు తీసుకురావాలంటూ మరో అధికారి సూచించారు. చివరకు వారంతా కలిసి ఫిర్యాదిని ఎస్సై సాంబశివయ్య వద్దకు పంపారు. అక్కడ కూడా ఎటువంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలో ఫిర్యాది తక్షణమే ఎఫ్‌ఐఆర్ కాపీ కావాలని, కనీసం రశీదు అయినా ఇవ్వాలంటూ గట్టిగా అడగడంతో స్టేషన్ సిబ్బంది ఆయన పట్ల అసభ్యంగా మాట్లాడారు. దీంతో తిరుగుముఖం పట్టిన జగదీష్ తాను తాలూకా పోలీసుస్టేషన్‌కు వెళితే జరిగిన అవమానాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
రైటర్ సస్పెన్షన్.. సీఐ సహా ఐదుగురికి ఛార్జి మెమోలు: తాలూకా పోలీసుస్టేషన్‌లో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు కావడంతో ఎస్పీ తక్షణమే క్రమశిక్షణా చర్యలకు పూనుకున్నారు. సభ్యత, సంస్కారంలేని మాటలతో ఫిర్యాదిని అవమానపరచడం, దురుసుగా మాట్లాడడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె.సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు సీఐ ఎం.లక్ష్మణ్, ఎస్సై సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ పి.ఏడుకొండలు, కానిస్టేబుల్ ఎంవీ రాజేష్, మహిళా కానిస్టేబుల్ ఎన్.రమ్యకిరణ్మయిలకు పనిష్మెంట్ కింద ఛార్జి మెమోలు జారీ చేశారు. ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదిదారులు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవమానకరంగా మాట్లాడినట్లు తమ దృష్టికి వచ్చినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment