ఆయనంటే హడల్
- ఆస్తిపాస్తుల కిరికిరి
- ఎస్సైలకు చార్జిమెమోలు
- వివరణ ఇచ్చినా బేఖాతరు
- రాష్ట్రస్థాయికి పేచీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:‘కనీసం సమాచారం ఇవ్వకుండా విలువైన అస్తులు కొనుగోలు చేశారు. ఎందుకు మీపై చట్టప్రకారం చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ... ’ ఇటీవల జిల్లాలో దాదాపు 43 మంది ఎస్సైలకు డీఐజీ కార్యాలయం నుంచి చార్జీమెమోలు జారీ అయ్యాయి. వీరిలో చాలామంది రెండేళ్ల కిందటే పోస్టింగ్‌లు పొందారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కొత్తలో అవగాహనలోపంతో కొందరు ఎస్సైలు తమ ఆస్తులు ఉన్నవి, లేనివి చూపించారు.
గతేడాది ఆరంభంలో డీఐజీ కార్యాలయం నుంచి వీరందరికీ ఆస్తులపై వివరణ ఇవ్వాలని మెమోలు జారీ అయ్యాయి. ఈ మధ్య వ్యవధిలో కొందరు ఎస్సైలు పెళ్లి చేసుకున్నారు. కట్నకానుకలు, డబ్బులు, బంగారం, వాహనాలు ఇతర విలువైన అస్తులు అదనంగా వచ్చిచేరాయి. ఆస్తుల వివరాల్లో తప్పులుంటే మన్నించాలని, ముందుగా అనుమతి తీసుకోవాలని తమకు తెలియదని ఎస్సైలు వివరణ ఇచ్చుకున్నారు.
కొన్ని జిల్లాల్లో తమ ఉద్యోగులు నిజాయితీగా సమాధానం ఇచ్చారని భావించి అక్కడి అధికారులు మానవతా దృక్పథంతో మెమోలు పక్కన బెట్టారు. కానీ.. మన జిల్లాలో ఎస్సైల వేడుకోలు బుట్ట దాఖలైంది. గతంలో చేసిన పొరపాటు మళ్లీ చేయబోమని, కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినందున దయతో మన్నించాలని ప్రొబేషనరీ ఎస్సైలు సంజాయిషీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మీపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ 15 రోజుల కిందట చార్జిమెమోలు జారీ అయ్యాయి. దీంతో ఎస్సైలు హడలెత్తిపోయారు. ప్రొబేషనరీ సమయం కావటంతో... ఇప్పుడు చార్జిమోమోలు ఇస్తే రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ఏం కిరికిరి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అదే అదనుగా సదరు ఉన్నతాధికారి కార్యాలయంలో చక్రం తిప్పే ఉద్యోగి రంగప్రవేశం చేసి... ఎంతోకొంత సమర్పిస్తే సమస్యను పరిష్కరిస్తానంటూ అసలు కబురు అందరికీ జారవేశారు.
దీంతో మెమోల జారీ వెనుక లోగుట్టు బయట పడినట్లయింది. ఎలాగైతేనేం.. అడిగినంత ఇచ్చి చేతులు దులుపుకోవటం నయమని కొందరు, అంత భారీ మొత్తం సమర్పించుకోలేమని కొందరు.. ఈ రాయ‘బేరం’పై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఉద్యోగి చెప్పిన ‘ఫిగర్' విన్నాక కొందరు ఎస్సైలు బిత్తరపోయారు. దీంతో ఆస్తుల మెమోల వ్యవహారానికి తాత్కాలికంగా పీటముడి పడింది. లూప్‌లైన్‌లో పని చేస్తున్న ఎస్సైలు అంత ‘భారం' భరించలేమంటూ చేతులెత్తేశారు.
చార్జిమెమోల సాకుతో తెరవెనుక జరుగుతున్న వసూళ్ల పర్వంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో రెండు రోజుల్లో స్వయానా సీఎం, హోంమంత్రి, డీజీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్సైల ఆస్తిపాస్తులు, అధికారి వసూళ్ల పేచీ రాష్ట్ర స్థాయికి చేరనుంది.
గతంలోనూ ఇదే అధికారిపై జిల్లాలో పలు ఆరోపణలు వెల్లువెత్తటం గమనార్హం. పోస్టింగ్‌ల్లో తల దూర్చడం, పోలీస్‌స్టేషన్ తనిఖీకి వెళ్లి బేరమాడటం, మాట వినకుంటే తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేయటం, అదే కార్యాలయంలో పాతుకుపోయిన ఓ ఉద్యోగిని అడ్డుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా చక్రం తిప్పుతున్న ఫిర్యాదులన్నీ మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది.