- రెండో రోజూ ఆస్పత్రికి రోగుల తాకిడి
మరో 19 మందికి అస్వస్థత
Published Fri, Jan 6 2017 10:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
కాకినాడ రూరల్ :
పండూరులో కుళాయిల ద్వారా సరఫరా అయిన కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు అధికంగా స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తరలి వస్తుండడంతో ఆస్పత్రి కిటకిటలాడింది. సరిపడినన్ని మంచాలు లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ రోగులను పరుండబెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కనీసం ప్రజల ఆరోగ్యానికి సంబంధించి రక్షిత తాగునీటిని అందించకపోవడం, గతంలో పనికిరావని తెలిసి మూతవేసిన పైపులను మళ్లీ తెరిపించి సూర్యారావుపేట పంపింగ్ స్కీము నీటిని సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారంటూ గ్రామస్తులు ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పండూరులో గురువారం కలుషిత నీరు తాగి 20 మంది అవస్థతకు గురికాగా శుక్రవారం మరో 19 మంది విరేచనాలు, వాంతులతో ఆస్పత్రికి తరలి వచ్చారు. రెండు రోజులుగా తాగునీటి వల్ల అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరుగుతుండడంతో మండల అధికార యంత్రాంగం మొత్తం పండూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక రోగులు మరింత అవస్థలు పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో విశ్వనాథరెడ్డి, మండల వైద్యాధికారి ఐ ప్రభాకర్ ఎప్పటికప్పుడు రోగుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుని వారికి వైద్యసేవలు అందజేస్తున్నారు. ప్రస్తుతం పండూరుకు సరఫరా అవుతున్న నీటిని నిలిపివేశామని, ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా కాకినాడ నుంచి నీటిని అందజేస్తున్నట్లు ఎంపీడీవో వివరించారు.
ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం: కన్నబాబు
సూర్యారావుపేట పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని సరఫరా చేసే గ్రామాలకు తక్షణం తాగునీటి సరఫరాను నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. పండూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలను ఆయన పరామర్శించి విలేకర్లతో మాట్లాడారు. పంపింగ్ స్కీమ్‌లో ఫిల్టర్ బెడ్లు మార్చాలని గతంలోనే అధికారులను కోరినా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ చేపలచెరువులోని నీరు తాగునీటి చెరువులోకి వస్తున్నా పట్టించుకోకుండా ఆ నీటినే నేరుగా ప్రజలకు అందించడం దారుణమన్నారు. సూర్యారావుపేట పంపింగ్ స్కీమ్ పేరుతో సరఫరా చేస్తున్న నీటిని తక్షణం నిలిపివేయాలని, ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలని కన్నబాబు అధికారులను కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నీటిని క్లోరినేష¯ŒS చేయకుండా సరఫరా చేస్తుండడంతో తాగునీరు మురుగునీటికన్నా దారుణంగా ఉంటుందని, నీటిలో బురదమట్టితో పాటు పురుగులు కూడా వస్తున్నాయని ప్రజలు కన్నబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వైద్యుడు ఐ.ప్రభాకర్, ఎంపీడీఓ సీహెచ్‌కే విశ్వనాథరెడ్డిలను కలసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కన్నబాబుతో పాటు పండూరు సొసైటీ అధ్యక్షుడు నందిపాటి సత్తిబాబు, ధర్మరాజు, సూర్యారావుపేట, ఉప్పలంక మాజీ సర్పంచ్‌లు కోమల సత్యనారాయణ, బొమ్మిడి శ్రీనివాస్ తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.
Advertisement
Advertisement