రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి గుంటూరు రీజియన్ నుంచి 20 మెట్రో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు....
గుంటూరు (పట్నంబజారు) : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి గుంటూరు రీజియన్ నుంచి 20 మెట్రో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కార్మిక పరిషత్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ నగరంలోని ప్రధాన కూడళ్లు, నాగార్జున యూనివర్సిటీ, రెయిన్‌ట్రీ పార్కు వద్ద నుంచి సచివాలయానికి మెట్రో సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.
సచివాలయం వద్ద ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉద్యోగులు హైదరాబాద్ వెళ్లేందుకు సచివాలయం నుంచి బస్సులు నడపనున్నట్లు, తిరిగి సచివాలయానికి రావడానికి ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయాన్ని ఆర్జించడానికి సమష్టిగా కృషి చేయాలని సిబ్బందికి తెలియజేశారు.
పోటీ వాతావరణంలో మరింత పోటీతత్వాన్ని పెంచుకొని, సమయపాలన పాటిస్తూ, నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. గుంటూరు రీజియన్‌లో ఉన్న 13 డిపోల్లో ఒక్క మాచర్ల డిపో మాత్రమే గత ఏడాదితో పోలిస్తే మెరుగైన ఆదాయాన్ని సాధిస్తోందని తెలిపారు.
డిపోల్లోని అధికారులు బస్సులను పంపించడమే కాకుండా బస్సుల పరిశుభ్రత, కండక్టర్లు, డ్రైవర్ల ప్రవర్తన, స్టేజిల్లో బస్సులు ఆపకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి ఉండడం, మహిళలతో అసభ్య ప్రవర్తన మొదలైన అంశాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో కార్మిక పరిషత్ రీజనల్ సెక్రటరీ రాజేష్, నరసరావుపేట, గుంటూరు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ వెంకటేశ్వరరావు, వాణిశ్రీ, అకౌంట్స్ ఆఫీసర్ పవన్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.